దాసరి నారాయణరావు మరణానంతరం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు మెగాస్టార్ చిరంజీవి. ఇదేమీ అధికారిక పదవి కాదు. ఆయనేమీ దాన్ని కోరి తీసుకోలేదు. తనకున్న స్థాయి వల్ల ఇండస్ట్రీలో చాలామంది ఆయన ఆ స్థానంలోకి రావాలని కోరుకున్నారు. చిరు కూడా అందుకు కాదనలేకపోయారు. దీన్ని ఒక హోదాలా కాకుండా బాధ్యతగా భావించి కరోనా కాలంలోనే కాక పలు సందర్భాల్లో పరిశ్రమ మేలు కోసం పాటుపడుతున్నారాయన. కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేయడమే కాక.. అనేక రకాలుగా ఇండస్ట్రీని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు చిరు.
ఈ క్రమంలోనే సినీ కార్మికుల కోసం ఆసుపత్రి కట్టాలనుకుంటున్న విషయాన్ని కొన్ని నెలల కిందట మే డే వేడుకల్లో చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనవసర విమర్శలు చేసినా చిరు పట్టించుకోలేదు. ఆ ఆసుపత్రి విషయంలో ఆయన సంకల్పంతోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగా హైదరాబాద్‌లో సెలబ్రెటీ క్రికెట్ కార్నివాల్‌కు సంబంధించి జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. ఈ ఆసుపత్రి గురించి వివరాలు వెల్లడించారు. తన తండ్రి కొణిదెల వెంకట రావ్ పేరు మీద చిత్రపురి కాలనీలో నివసించే కార్మికుల కోసం ఆసుపత్రి కట్టించబోతున్నట్లు చిరు వెల్లడించారు. ఈ ఆలోచన వచ్చినప్పటి నుంచి దానిపై పని చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టగలిగే శక్తి భగవంతుడు తనకు ఇచ్చాడని.. ఎవరైనా ఇందుకు సహకారం అందించడానికి ముందుకు వస్తే స్వీకరిస్తామని చిరు అన్నారు.
ఈసారి తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆసుపత్రి గురించి వివరాలు వెల్లడిస్తున్నానని.. వచ్చే ఏడాది తన పుట్టిన రోజు నాటికి ఈ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయని చిరు తెలిపారు. తాను ఇంత వాడిని కావడానికి కారణమైన కార్మికులు, ప్రేక్షకుల కోసం ఏదైనా చేయాలన్న తలంపుతోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని.. ఇప్పుడు ఆసుపత్రిని ఏర్పాటు చేయిస్తున్నానని చిరు వెల్లడించారు.