పాపం ఆమిర్.. అందరూ కక్ష గట్టేశారు

లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఆమిర్ ఖాన్. సినిమా కోసం అతను పడే కష్టం, ప్రేక్షకులకు కొత్తగా ఏదో ఇవ్వాలని అతను చూపించే తపన గురించి అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఎనిమిదేళ్ల ముందు నటించిన సినిమాలోని ఒక సన్నివేశంలో హిందూ దేవుడిని కించపరిచాడని.. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఏదో కామెంట్ చేశాడని.. ఇప్పుడు అతడి సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ను మరీ దారుణంగా టార్గెట్ చేశారు.

పీకే తర్వాత ఆమిర్ సినిమా ‘దంగల్’ వసూళ్ల మోత మోగించింది. రికార్డులు బద్దలు కొట్టింది. కానీ ఆ టైంలో ఆమిర్ మీద ఏ వ్యతిరేకతా లేదు. ఆ సినిమాను టార్గెట్ చేయలేదు. ఆ తర్వాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో కంటెంట్ లేక డిజాస్టర్ అయింది కానీ.. దానికి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. పనిగట్టుకుని ఆ సినిమాను కూడా టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడు అసలే కొవిడ్ దెబ్బకు హిందీ చిత్రాల పరిస్థితి దయనీయంగా మారిన పరిస్థితుల్లో ఆమిర్ కొత్త చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని రోజుల తరబడి నెగెటివ్ క్యాంపైన్ నడిపారు.

‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోని విషయం వాస్తవమే అయినా.. విడుదలకు ముందే దీని మీద విపరీతమైన నెగెటివిటీ నెలకొనేలా, అది ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపేలా చేయడంలో కొన్ని వర్గాలు విజయవంతం అయ్యాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు సినిమాకు నెగెటివ్ టాక్ రావడం, ఆల్రెడీ సినిమాను టార్గెట్ చేస్తున్న వాళ్లు టాక్‌ను మరింత స్ప్రెడ్ చేయడంతో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పలేదు. తొలి రోజే 1300కు పైగా షోలు జనాల్లేక క్యాన్సిల్ అయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డిజాస్టర్ అయినప్పటికీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’కు తొలి రోజు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రావడం గమనార్హం. అలాంటిది లాల్ సింగ్ చడ్డా ఫుల్ రన్లో ఈ వసూళ్లు మార్కును అందుకుంటే గొప్ప అన్నట్లుంది.

రకరకాల కారణాలు చూపించి ఈ సినిమాను టార్గెట్ చేసిన వర్గాల సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాను అదే పనిగా టార్గెట్ చేయడం గమనార్హం. దీంతో పాటే రిలీజైన ‘రక్షా బంధన్’ కూడా ప్రేక్షకులకు రుచించలేదు. కానీ దానికి మాత్రం ఫుల్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఆ చిత్రానికి వసూళ్లు లేకున్నా దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఆమిర్ సినిమా గురించి మాత్రం ప్రతి రోజూ కలెక్షన్ల రిపోర్ట్ ఇస్తూ, సినిమా అంత డిజాస్టర్ ఇంత డిజాస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కంటెంట్, కలెక్షన్ల విషయంలో ‘లాల్ సింగ్ చడ్డా’తో పోలిస్తే ‘రక్షా బంధన్’ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేకున్నా.. దాని గురించి మాట్లాడకుండా ఆమిర్ సినిమా గురించే ప్రస్తావించడం అంటే వాళ్లు కూడా అతడి మీద కక్ష గట్టినట్లే కనిపిస్తోంది.