ఆ సినిమాను బ‌య‌టికి తీయ‌మ‌న్న రాజ‌మౌళి

Rajamouli
Rajamouli

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌పూర్ ఒక‌రు. హిందీలో మిస్ట‌ర్ ఇండియా మాత్ర‌మే కాక‌.. హ‌లీవుడ్లో బండిట్ క్వీన్ స‌హా కొన్ని అద్భుత‌మైన సినిమాలు తీసి అంత‌ర్జాతీయ స్థాయిలో త‌న పేరు మార్మోగేలా చేసిన ద‌ర్శ‌కుడాయ‌న‌. అంత‌టి ద‌ర్శ‌కుడు మ‌న రాజ‌మౌళి పేరెత్తితే చాలు ఉద్వేగానికి గురవుతాడు. బాహుబ‌లి చూసి ఫిదా అయిపోయిన శేఖర్.. ప‌లు సంద‌ర్భాల్లో జ‌క్క‌న్న‌ను ఆకాశానికెత్తేశాడు.

సినిమాలు ఎలా తీయాలో రాజ‌మౌళిని చూసి బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు పాఠాలు నేర్చుకోవాల‌ని అన్నాడు. తాజాగా రాజ‌మౌళిని శేఖ‌ర్ క‌లిశాడు. ఎక్క‌డ ఏంటి అన్నది చెప్ప‌లేదు కానీ.. రాజ‌మౌళితో ఉన్న ఫొటోను షేర్ చేసి ఆయ‌న‌తో ఒక రోజంతా గ‌డిపాన‌ని.. సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడాన‌ని.. ఇది త‌న‌కు విలువైన‌ పాఠ‌మ‌ని వ్యాఖ్యానించాడు శేఖ‌ర్.

దీనికి రాజ‌మౌళి చాలా హుందాగా స్పందించాడు. శేఖ‌ర్‌ను క‌ల‌వ‌డం త‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. అంతే కాక ఎప్ప‌ట్నుంచో పెండింగ్‌లో ఉన్న శేఖ‌ర్ క‌ల‌ల సినిమా పానిని బ‌య‌టికి తీయాల‌ని అత‌ను కోరాడు. పాని డ్యాంలో చాన్నాళ్లు ఉండిపోయింద‌ని, గేట్లు ఎత్తి దాన్ని బ‌య‌టికి తేవాల‌ని రాజ‌మౌళి కోరాడు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో సుశాంత్ రాజ్ పుత్‌ హీరోగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ‘పాని’ సినిమాను నిర్మించాలని చాలా ఏళ్ల‌ కిందటే సన్నాహాలు చేసింది.

దీని కోసం సుశాంతో ఎంతో కష్టపడి సిద్ధమయ్యాడు కూడా. కానీ అనివార్య కారణాలతో అది ఆగిపోయింది. కొన్నేళ్ల‌కు సుశాంత్ చ‌నిపోయాడు. పాని పూర్తిగా అట‌కెక్కేసింది. ఐతే ఈ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణాలేంటో కానీ.. ఈ ప్రాజెక్టును శేఖ‌ర్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించాడు. చాలా ఏళ్ల పాటు దీని కోసం ప‌రిశోధ‌న చేశాడు. భ‌విష్య‌త్తులో నీళ్లు ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారి, దాని కోసం యుద్ధాలు జ‌రిగే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీయాల‌నుకున్నాడు శేఖ‌ర్.