పెళ్లిపై ఇంకో హీరోయిన్ వెన‌క్కి?

అవును స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించిన మ‌ల‌యాళ హీరోయిన్ పూర్ణ. ముస్లిం అయిన ఆమె అస‌లు పేరు ష‌మ్మ ఖాసిమ్ అయిన‌ప్ప‌టికీ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పూర్ణ‌గానే ప‌రిచ‌యం. సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాక బుల్లితెర‌పై దృష్టిసారించి అక్క‌డ ప‌లు షోల్లో ద‌ర్శ‌నం ఇస్తున్న పూర్ణ‌.. ఇటీవ‌ల పెళ్లి వార్త‌తో మీడియా దృష్టిని ఆక‌ర్షించింది. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడ‌బోతున్న‌ట్లు స్వ‌యంగా పూర్ణ‌నే వెల్ల‌డించింది.

వీళ్లిద్ద‌రి ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అసిఫ్ అలీతో పూర్ణ‌కు ఎంగేజ్మెంట్ కూడా అయింది. త్వ‌ర‌లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ పెళ్లి ర‌ద్ద‌యిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. కారణాలేంటో తెలియ‌దు కానీ.. అసిఫ్ అలీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని పూర్ణ నిర్ణ‌యించుకుని నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకుంద‌ట‌. దీనిపై ఇప్ప‌టిదాకా అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు.

ఇలా హీరోయిన్లు ఎంగేజ్మెంట్ చేసుకున్న కొంత కాలానికి పెళ్లి విష‌యంలో వెనుకంజ వేసిన సంద‌ర్భాలు కొత్త కాదు. గ‌తంలో అగ్ర క‌థానాయిక త్రిష‌.. కోలీవుడ్‌కు చెందిన వ‌రుణ్ మ‌ణియ‌న్ అనే ప్రొడ్యూస‌ర్ క‌మ్ బిజినెస్‌మ్యాన్‌తో నిశ్చితార్థం చేసుకోవ‌డం, త‌ర్వాత దాన్ని ర‌ద్దు చేసుకోవ‌డం తెలిసిందే. ఇక గ‌త ఏడాది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ సైతం ఇదే పని చేసింది. భ‌వ్య బిష్ణోయ్ అనే పంజాబ్ రాజ‌కీయ నేత‌తో నిశ్చితార్థం అనంత‌రం కొన్ని నెల‌ల‌కు అత‌డితో పెళ్లి ర‌ద్దు చేసుకుంది.

ఇప్పుడు పూర్ణ కూడా ఇదే బాట‌లో న‌డుస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఎంగేజ్మెంట్ త‌ర్వాత జ‌రిగే ట్రావెల్‌లో అభిప్రాయాలు క‌ల‌వ‌క‌పోవ‌చ్చు. నటిగా కొనసాగే విష‌యంలో ఏవైనా ప‌రిమితులు పెట్ట‌వ‌చ్చు. ఇలాంటి కార‌ణాలే పెళ్లి ర‌ద్దుకు కార‌ణంగా మారుతుండొచ్చు. మ‌రి పూర్ణ విష‌యంలో ఏం జ‌రిగిందో ఏమో మ‌రి. ఇంత‌కీ నిశ్చితార్థం ర‌ద్దుపై పూర్ణ నుంచి అధికారిక స‌మాచారం బ‌య‌టికి వ‌స్తుందేమో చూడాలి.