చాలామందిని చూసి.. చివరికి జగపతినే

తెలుగులో కొంచెం పోష్ లుక్ ఉన్న స్టైలిష్ విలన్ పాత్ర అనగానే అందరికీ జగపతిబాబే గుర్తుకు వస్తున్నాడు. ‘లెజెండ్’తో ప్రతినాయక పాత్రల్లోకి మారిన జగపతి.. అప్పట్నుంచి పోష్ విలన్ పాత్రలు చాలానే చేశాడు. ఈ పాత్రలు చేసి చేసి తనకు బోర్ కొట్టేస్తోందని కూడా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా సరే.. పెద్ద స్టార్లు చేసే భారీ చిత్రాల్లో ఆ తరహా పాత్రలు వస్తే ఆయన కాదనలేకపోతున్నారు.

ఫిలిం మేకర్స్ కూడా ఆ టైపు పాత్రలే రాసి.. జగపతి వైపే చూస్తున్నారు. తాజాగా జగపతికి అలాంటి పాత్ర మరొకటి తగిలింది. మెగాస్టార్ చిరంజీవి చేయబోయే ‘లూసిఫర్’ రీమేక్‌లో విలన్ పాత్రను జగపతిబాబే చేయబోతున్నట్లు సమాచారం. ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను ఇక్కడ ఆయన చేయనున్నారు.

ఓవైపు డ్రగ్ మాఫియాను నడుపుతూ.. మరోవైపు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే కింగ్ మేకర్ పాత్ర ఇది. ఈ పాత్రకు తెలుగులో పర్ఫెక్ట్‌గా సూటయ్యే నటుడంటే జగపతిబాబే. ఐతే ఆయన ఇలాంటి పాత్రలు చాలా చేసిన నేపథ్యంలో ఇంకెవరైనా ఉన్నారేమో అని చూశాడట దర్శకుడు సుజీత్, నిర్మాత చరణ్. ఐతే కొన్ని పేర్లు అనుకున్నప్పటికీ ఎవరితోనూ సంతృప్తి చెందక చివరికి జగపతినే ఓకే చేశారట.

చిరంజీవి సినిమాలో విలన్ పాత్ర అంటే.. క్యారెక్టర్ ఎలాంటిదని జగపతి ఎందుకు చూస్తాడు? ఆయన కూడా సింపుల్‌గా ఓకే చెప్పేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోకు సోదరి తరహా పాత్ర ఒకటి ఉంటుంది. దానికి విజయశాంతి, సుహాసినిల పేర్లు వినిపించాయి ఇంతకుముందు. ఐతే చివరికి ఖుష్బును ఈ పాత్రకు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు ఆమె ‘స్టాలిన్’లో చిరుకు సోదరిగా నటించడం విశేషం.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content