నందమూరి హీరోలకు హిట్ సెంటిమెంట్

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు భలేగా వర్కౌట్ అవుతాయి. కావాలని ఫాలో అయినవి కాకపోయినా వాటి వల్ల వచ్చే ఫలితాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవలి కాలం నందమూరి హీరోలకు పాప ఫ్యాక్టర్ ఆయా చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడానికి ఉపయోగపడ్డాయన్నది వాస్తవం.

అదెలాగో చూద్దాం. గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన బ్లాక్ బస్టర్ అఖండలో చిన్న బాలకృష్ణ కూతురిగా నటించిన బేబీ చుట్టే దర్శకుడు బోయపాటి శీను సెకండ్ హాఫ్ మొత్తం నడిపించాడు. సీక్వెల్ కి లింక్ కూడా అక్కడే ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన భీముడి క్యారెక్టర్ పోరాడేది చిన్నపాపైన మల్లి కోసం. తారక్ తాలూకు ఎమోషన్ రామ్ చరణ్ కన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యింది ఈ క్యారెక్టర్ తోనే.

తాజాగా రిలీజైన బింబిసారలో చెడ్డవాడైన చక్రవర్తి తన చేతిలో మరణించిన పాప కోసం ప్రాయశ్చిత్తంగా వర్తమానంలో తన ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. దర్శకుడు వశిష్ట ప్రెజెంట్ చేసిన థీమ్ లో బలమైన పాయింట్ ఇదే. సో అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసారలో  చైల్డ్ సెంటిమెంట్ ఇంత బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వడం స్పెషలేగా.

అది కూడా కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఈ మూడు హిట్ కావడం గమనార్హం. దెబ్బకు నందమూరి ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ సక్సెస్ దక్కడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. భారీ బడ్జెట్ ని రిస్క్ లో పెట్టి నిర్మిస్తే దానికి తగ్గ ఫలితాన్ని అందుకుంది. బింబిసార 2 కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ చిట్టితల్లిని కంటిన్యూ చేస్తారు. అన్నట్టు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోయే బాలయ్య 107 మూవీలో కూడా ఇలాంటి పాప థ్రెడ్ ఏమైనా ఉందేమో చూడాలి