హను రాఘవపూడి.. ఈ శుక్రవారం మధ్యాహ్నం నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మార్మోగుతున్న పేరు. తెలుగులో చాలా ఏళ్ల తర్వాత ఒక అందమైన, అద్భుతమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఘనత ఇతడికే దక్కుతుంది. తెలుగులో ఓ మోస్తరుగా అనిపించే ప్రేమకథలు వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. అలాంటిది తొలి రోజే క్లాసిక్ అని అందరూ తీర్మానించే స్థాయిలో లవ్ స్టోరీ అంటే చిన్న విషయం కాదు.
సీతారామం ఆ ఘనత సాధించింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం అతడి వైపు చూసేలా చేసింది. నిజానికి హను తీసిన గత రెండు చిత్రాలు అతడికి చాలా చెడ్డ పేరు తెచ్చాయి. లై, పడి పడి లేచె మనసు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ముఖ్యంగా పడిపడి లేచె మనసు హను కెరీర్‌కు తెరదించేసేట్లు కనిపించింది. అలాంటి పరాజయం తర్వాత అతణ్ని నమ్మి ఎవరు సినిమా చేస్తారనే ప్రశ్న తలెత్తింది. అతను పుంజుకుంటాడని ఎవరూ అనుకోలేదు.
కానీ వైజయంతీ మూవీస్ హనును నమ్మి మంచి బడ్జెట్లో, చక్కటి కాస్ట్ అండ్ క్రూతో, రాజీ లేని ప్రొడక్షన్‌తో.. సినిమా తీసింది. ఆ సంస్థ నమ్మకాన్ని నిలబెడుతూ హను గొప్ప సినిమాను డెలివర్ చేశాడు. ఇది హను కెరీర్లో బెస్ట్ మూవీ అనడంలో మరో మాట లేదు. మళ్లీ ఇంత మంచి సినిమాను తీయగలడో లేదో కూడా చెప్పలేం. హను తొలి రెండు చిత్రాలు అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ అతడికి మంచి పేరు తెచ్చినా, కమర్షియల్‌గా కూడా ఓకే అనిపించినా.. పూర్తి సంతృప్తిని అయితే అందించలేకపోయాయి.
ఇక తర్వాతి రెండు చిత్రాల సంగతి తెలిసిందే. హను కథలు బాగుంటాయని, ఒక దశ వరకు సినిమాను బాగానే నడిపిస్తాడని, మంచి ఫీల్ ఇస్తాడని.. తర్వాత చేజేతులా సినిమాను నాశనం చేస్తాడని, సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అతడి బలహీనత అని రకరకాల విమర్శలు వ్యక్తమయ్యాయి అతడి మీద. సీతారామం ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించిన అతను.. ఈసారి ఆ తప్పును సరిదిద్దుకున్నట్లు చెప్పాడు. సినిమా చూస్తే ఆ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates