మ‌మ్మ‌ల్ని మ‌రోసారి బ‌తికించారు-క‌ళ్యాణ్ రామ్

బింబిసార సినిమా మీద నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, అత‌డి టీం పెట్టుకున్న న‌మ్మ‌కం నిజ‌మైంది. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రి రిలీజ్ బ‌జ్ వ‌ల్ల ముందే ఈ సినిమాకు మంచి బుకింగ్స్ జ‌ర‌గ‌గా.. టాక్ బాగుండ‌డంతో తొలి రోజు వ‌సూళ్లు మ‌రింత పుంజుకున్నాయి. సినిమా హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతోంది. సాయంత్రానికి అద‌న‌పు థియేట‌ర్లు, షోలు వేసేంత డిమాండ్ వ‌చ్చిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఊపు చూసి ఆల‌స్యం చేయ‌కుండా ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ‌తో క‌లిసి ప్రెస్ మీట్ పెట్టాడు క‌ళ్యాణ్ రామ్.

త‌న సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ చెబుతూ అత‌ను ఒకింత ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పాడు. ఇది మా విజయం అని చెప్పుకోను. ఇది ప్రజల విజయం. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే.. జనాలు తండోపతండాలుగా థియేటర్లకి వస్తారని నిరూపించారు. ఈ విజయానికి మా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీకు రుణపడి ఉంటాం. మరోసారి మమ్మల్ని బ‌తికించారు మీరు.  

ముందు ముందు మంచి సినిమాలతో మీముందుకు వస్తానని తెలియజేస్తున్నాను అని క‌ళ్యాణ్ రామ్ అన్నాడు. తన‌కు ఇంత మంచి సినిమాను ఇచ్చిన ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ‌కు కృతజ్ఞ‌త‌లు చెప్పిన క‌ళ్యాణ్ రామ్.. బింబిసార‌కు సీక్వెల్ ఉంటుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు. బింబిసారుడు అనే గొప్ప పాత్ర‌ను నేను చేయగలనో లేదో నాకు తెలియ‌దు కానీ నేను చేయగలను అని.. ఈ సినిమాని నా దగ్గరకు తీసుకువచ్చిన దర్శకుడు వశిష్టకు ఎంత‌ థ్యాంక్స్ చెప్పినా సరిపోదు.

ఇక ‘బింబిసార’ పార్ట్ 2ను బాధ్యతతో తెరకెక్కించాల్సిన బాధ్యతను వశిష్టకు అప్పగిస్తున్నాను. ఆ సినిమాతో భారీగా.. ఇంకో అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వస్తాం అని క‌ళ్యాణ్ రామ్ చెప్పాడు. ఈ సినిమాకు ప్రోత్సాన్నిచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. అత‌నే త‌మ తొలి ప్రేక్ష‌కుడ‌ని, సినిమా చూసి ఇది పెద్ద విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని ఇచ్చాడ‌ని చెబుతూ ల‌వ్ యూ నానా అని త‌న త‌మ్ముడిపై ప్రేమ‌ను చూపించాడు నంద‌మూరి హీరో.