బింబిసార.. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన ఈ భారీ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతోనే వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంత భారీ సినిమా తీయడం, అతణ్ని నమ్మి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ పెట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశం అయింది.
ఈ సినిమా ప్రోమోలు చూసిన వాళ్లంతా కూడా ఆశ్చర్యపోయారు. బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్.. ఈ కుర్రాడి గురించి ఇచ్చిన ఎలివేషన్, సినిమా గురించి చెప్పిన తీరు కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఐతే మామూలు ప్రేక్షకులకు వశిష్ఠ్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఇండస్ట్రీ జనాలకు అతను బాగానే పరిచయం. తన బ్యాగ్రౌండ్, ఇండస్ట్రీలో తన జర్నీ ఆసక్తి రేకెత్తించేదే.
ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న వశిష్ఠ్.. 15 ఏళ్ల కిందటే హీరోగా ఓ సినిమా చేయడం విశేషం. ఆ సినిమా పేరు.. ప్రేమలేఖ రాశా. ఆ పేరుతో ఓ సినిమా ఉన్నట్లు కూడా జనాలకు తెలియదు. ఢీ సహా కొన్ని సినిమాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ కొడుకే వశిష్ఠ్. అతడి అసలు పేరు మల్లిడి వేణు. ఈ పేరుతోనే హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.
తనకు నటన సూట్ కాదని ఫిక్సయి తర్వాత దర్శకత్వ విభాగంలో పని చేశాడు. అతను ఎన్నో ఏళ్ల ముందే దర్శకుడు కావాల్సింది. రవితేజ, అల్లు శిరీష్‌లతో సినిమాలు ఓకే అయినట్లే అయి వెనక్కి వెళ్లిపోయాయి. శిరీష్ శ్రీరస్తు శుభమస్తు తర్వాత పెద్ద బడ్జెట్లో వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు కూడా. కానీ బడ్జెట్ సమస్యలతోనే ఆ సినిమా ఆగిపోయింది. చివరికి బింబిసార కథతో అతను కళ్యాణ్ రామ్‌ను మెప్పించి ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.