మహేష్ మాస్ పవర్ చూపించేశారు

శ్రీమంతుడు నుంచి ఒకరకమైన సాఫ్ట్ హీరోయిజంకి అలవాటు పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబుని ఒకప్పటి మాస్ లో చూడాలని అభిమానులు ఎంతగా తహతహలాడిపోతున్నారో మరోసారి ఋజువయ్యింది. ఒక్కడు సినిమాని నిన్న రాత్రి రాజమండ్రి మురళీకృష్ణ థియేటర్లో ప్రత్యేకంగా రీ మాస్టర్ చేయించిన ప్రింట్ తో స్పెషల్ ప్రీమియర్ వేశారు.

ఇరవై ఏళ్ళ తర్వాత మహేష్ అడ్డాగా చెప్పుకునే హైదరాబాద్ కాకుండా ఒక జిల్లా కేంద్రంలో రీ రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో స్పందన ఎలా ఉంటుందానే డౌట్ లేకపోలేదు. ఆ అనుమానాలన్నీ బద్దలు కొడుతూ ఒక్కడు కిక్కిరిసిన ఫ్యాన్స్ మధ్య బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో షో కళకళలాడిపోయింది. చాలా మందికి టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగడం అనూహ్యం.

మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న ఉన్న నేపథ్యంలో ఆ రోజు పోకిరిని ప్లాన్ చేసుకున్న అభిమానులు రెండూ ఒకే రోజు క్లాష్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఆగస్ట్ మొదటి వారంలోనే ఒక్కడుని వేసుకుంటున్నారు. ఇవాళ నుంచి గుంటూరు, విజయవాడ, తెనాలి తదితర ప్రాంతాల్లో ఒక్కడు రచ్చ చేయబోతున్నాడు.

మరోవైపు పోకిరి అడ్వాన్స్ బుకింగ్ భీభత్సమైన స్వింగ్ లో ఉంది. కాకినాడలో కేవలం తొమ్మిది నిమిషాల్లో మొత్తం ఏడు వందల టికెట్లకు పైగా అమ్ముడుపోవడం యాజమాన్యానికి సైతం షాక్ ఇచ్చింది. దీంతో రెండో స్క్రీన్ జోడించే పనిలో పడ్డారు. అసలు కొత్త సినిమాలకే జనం రాక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటుంటే ఇప్పుడీ పోకిరి, ఒక్కడు సినిమాలకు పడుతున్న నీరాజనం చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. అన్నట్టు భాగ్యనగరంలో షోల కోసం మూవీ లవర్స్ పిచ్చిపిచ్చిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడెంత భీభత్సంగా ఉంటుందో వేరే చెప్పాలా..