జల్సా ట్రెండింగ్.. కారణం మహేష్ ఫ్యాన్స్

జల్సా.. ఎప్పుడో 2008లో విడుదలైన సినిమా. ఇప్పుడేమీ ఆ చిత్రానికి వార్షికోత్సవం జరగట్లేదు. అయినా సరే.. ట్విట్టర్లో టాప్‌లో ఆ సినిమా పేరు ట్రెండ్ అవుతోంది. మరి సందర్భం లేకుండా ఈ సినిమా పేరు ఎందుకు ట్రెండ్ అవుతోంది అని ఆశ్చర్యం కలగడం సహజం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పంతం పట్టి చేస్తున్న ఓ డిమాండ్ వల్ల ఈ పేరు ఇప్పుడిలా ట్రెండ్ అవుతోంది. వీరి పట్టుదల మహేష్ అభిమానులు పరోక్షంగా కారణం కావడం విశేషం. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని పోకిరి, ఒక్కడు సినిమాల స్పెషల్ షోలను తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ప్రదర్శించబోతుండటం తెలిసిందే.

గతంలో ఏ హీరో పుట్టిన రోజుకూ లేని స్థాయిలో ఈ స్పెషల్ షోల సందడి ఉండబోతోంది. ఒక కొత్త సినిమా రిలీజవుతున్న స్థాయిలో ఈ స్పెషల్ షోలకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. యుఎస్‌లో ఒక షోకు పెట్టిన టికెట్లు గంటలో అయిపోవడం ఈ క్రేజ్‌కు నిదర్శనం.

పోకిరి సినిమా ప్రింట్‌ను రీమాస్టర్ చేసి, 4కే రెజొల్యూషన్‌తో రిలీజ్ చేయబోతుండటం మహేష్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. వారి ఎగ్జైట్మెంట్ చూసి పవన్ అభిమానుల్లోనూ ఆశ పుట్టింది. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘జల్సా’ను ఆయన పుట్టిన రోజు అయిన సెప్టెంబరు 2న స్పెషల్ షోలుగా వేయాలని వాళ్లు ప్రణాళికలు వేస్తున్నారు.

ఐతే ఈ ప్రింట్‌‌ను కూడా హెచ్డీలో 4కే రెజొల్యూషన్‌కు మార్చి షోలు వేయాలని వారు కోరుకుంటున్నారు. ఐతే ‘జల్సా’ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ వర్గాల ప్రకారం.. ఈ సినిమాను హెచ్డీలోకి మార్చడం కష్టమని అంటున్నారు. మెగా ఫ్యామిలీ సినిమాలకు పని చేసే పీఆర్వోలతో పాటు మెగా అభిమాని అయిన దర్శకుడు సాయిరాజేష్ కూడా గీతా ఆర్ట్స్ వర్గాలతో దీని గురించి మాట్లాడుతున్నారు కానీ.. ఈ ప్రింట్‌ను రీమాస్టర్ చేసే విషయంలో క్లారిటీ రావట్లేదు.

ఐతే పవన్ అభిమానులు మాత్రం ‘జల్సా’ సినిమా గురించి పెద్ద ఎత్తున డిస్కషన్లు పెడుతున్నారు. అంతే కాక #Geethaartswewantjalsa4k అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ అభిమానుల హంగామా చూసి వాళ్లకు పోటీగా పవన్ ఫ్యాన్స్ ‘జల్సా’ సినిమాతో చేయాలనుకున్న రచ్చకు గీతా ఆర్ట్స్ ఎంతమేర సహకారం అందిస్తుందో చూడాలి.