కొన్ని రోజులుగా టాలీవుడ్ బడా నిర్మాతలు మీటింగులు పెట్టుకుంటూ కొన్ని సమస్యలపై చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మీటింగ్ లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్న అనంతరం ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ బంద్ అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి కొన్ని రోజులుగా షూటింగ్ బంద్ అనే వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఫస్ట్ మీటింగ్ లోనే బంద్ మేటర్ బయటికొచ్చేసింది. కానీ దిల్ రాజు అలాంటిదేం లేదని ఇంకా మీటింగ్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా షూటింగ్ బంద్ అంటూ ప్రకటించారు.
కోవిడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. సక్సెస్ రేటు బాగా పడిపోయింది. కొన్ని వారాలుగా సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్ప థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల హంగామా ఏమి కనిపించడం లేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. అందుకే ప్రొడ్యుసర్ గిల్డ్ చర్చలు జరుపుకుంది. టికెట్ రేటు, ఓటీటీ డీల్, హీరోల రెమ్యునరేషన్స్, కాస్ట్ కంట్రోల్ ఇలా చాలా విషయాలపై చర్చ పెట్టుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కంటెంట్ మీద ఫోకస్ పెట్టి కరోన కి ముందు అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం గురించి కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ మీటింగ్స్ లో భాగంగా షూటింగ్స్ బంద్ ఎందుకు పెట్టుకున్నారు ? దీని ద్వారా నిర్మాతలకు జరిగేదేమిటి ? ఒరిగెదేంటి అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా నిర్మాతల మండలి నిర్ణయం తీసేసుకుంది ఆగస్ట్ 1 నుండి ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. బంద్ వల్ల ఇటు బడా సినిమాలకు అటు చిన్న చిత్రాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. అలాగే టెక్నీషియన్స్ పై బాగా ఎఫెక్ట్ పడనుంది. ప్రేక్షకుడికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. హాయిగా రిలీజయ్యే సినిమాలు చూడొచ్చు.