భయం భయంగా బ్రహ్మాస్త్ర

కాళ్ళ కింద భూమి కంపించడం అంటే ఏంటో బాలీవుడ్ కు ఇప్పుడు అర్థమవుతోంది. రెండేళ్ల నుంచి ఒక్కటంటే ఒక్కటి ఘనంగా చెప్పుకునే ఇండస్ట్రీ హిట్ లేకపోవడం ట్రేడ్ ని విపరీతంగా కలవరపెడుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భూలయ్యా 2, సూర్యవంశీ లాంటివి విజయం సాధించినప్పటికీ కనీసం అయిదు వందల కోట్ల మార్కుని ఏదీ అందుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే వచ్చిన షంషేరా దెబ్బకు ఎగ్జిబిటర్లు కకావికమవుతున్నారు. 150 కోట్ల బడ్జెట్ కు మహా అయితే 40 కోట్ల కంటే వెనక్కు వచ్చేలా లేదు.

ఇప్పుడిదంతా సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న మల్టీ స్టారర్ బ్రహ్మాస్త్ర మీద పడుతోంది. ఇందులోనూ షంషేరా హీరో రన్బీర్ కపూరే హీరో. ఏదో ఎంటర్ టైన్మెంట్ జానర్ కు కట్టుబడకుండా విజువల్ గ్రాండియర్ల వెంటబడుతున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రిలీజ్ కు కేవలం నలభై అయిదు రోజుల సమయమే ఉన్నప్పటికీ ఆశించిన బజ్ రావడం లేదు. ట్రైలర్ లో గ్రాఫిక్స్ మీద మరీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవడం గట్టి ప్రభావమే చూపించింది. నాగార్జున ఉన్నప్పటికీ తెలుగులో పెద్ద అంచనాలేం లేవు.

బ్రహ్మాస్త్ర అసలే మూడు భాగాలుగా వస్తోంది. మొదటిది ఏ మాత్రం అటుఇటు అయినా రెండో దాని మీద ఆసక్తి చచ్చిపోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ సీక్వెల్ కి జరిగింది అదే. బాహుబలి, కెజిఎఫ్ లకు ఆ సమస్య రాలేదు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యాయి కాబట్టి సీక్వెల్స్ కి డిమాండ్ వచ్చింది. కానీ బ్రహ్మస్త్ర కనక అటుఇటు అయితే మాత్రం అంతే సంగతులు. కరణ్ జోహార్ నిర్మాణం, అలియా భట్ ప్రెజెన్స్, టాలీవుడ్ కు రాజమౌళి సమర్పణ, అమితాబ్ లాంటి గ్రాండ్ క్యాస్టింగ్ ఇవన్నీ ఎలా ఉన్నా బలమైన కంటెంట్ ఉంటే తప్ప నార్త్ ఆడియన్స్ థియేటర్ల వైపు కదల్లేని పరిస్థితుల్లో బ్రహ్మస్త్ర ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతుందో చూడాలి.