చైతూ స్టార్ పవర్‌కు పంచ్

మాస్, యాక్షన్ సినిమాలు తమకు సెట్ అయినా కాకపోయినా.. హీరోలు మళ్లీ మళ్లీ అలాంటివి ట్రై చేస్తూనే ఉంటారు. ఇక పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలైతే మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. ఆ ఇమేజ్ వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. మాస్‌‌లో ఆదరణ దక్కుతుంది. దాని వల్ల ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. ఐతే అక్కినేని కథానాయకుడు నాగచైతన్య మాత్రం ఎంత కష్టపడ్డా అనుకున్నంత స్థాయిలో మాస్ ఇమేజ్ తెచ్చుకోలేకపోయాడు.

తొలి చిత్రం ‘జోష్’ హిట్టయితే కథ వేరుండేదేమో కానీ.. తనకు తొలి విజయాన్నందించింది ‘ఏమాయ చేసావె’ అనే క్లాస్ లవ్ స్టోరీ కావడంతో అతడికి ఆ టైపు సినిమాలే కరెక్ట్ అనే అభిప్రాయం అందరిలోనూ బలంగా పడిపోయింది. కెరీర్లో చాలా వరకు లవ్ స్టోరీలతోనే అతను మంచి ఫలితాలందుకున్నాడు. మాస్, యాక్షన్ సినిమాలు చేసినపుడు చాలా వరకు ఎదురు దెబ్బలే తగిలాయి. దడ, ఆటోనగర్ సూర్య, యుద్ధం శరణం లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఇలా ఎదురు దెబ్బలు తగిలినపుడల్లా క్లాస్ సినిమా చేసి విజయాన్నందుకున్నాడతను.

ఐతే ఇప్పుడు ‘థాంక్యూ’ అతడి శైలి క్లాస్ సినిమానే అయినా కూడా ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లేదు. ఈ చిత్రానికి వస్తున్న ఓపెనింగ్స్ కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కరోనా తర్వాత థియేటర్ల మీద బాగా నెగెటివ్ ఇంపాక్ట్ పడడం తెలిసిందే. అసలే జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోయిందనుకుంటే.. టికెట్ల రేట్లు పెరగడం కూడా చేటు చేస్తోంది. ఇప్పుడు వర్షాలు సైతం దెబ్బ కొడుతున్నాయి. అన్నీ కలిసి ‘థాంక్యూ’ థియేటర్లు తొలి రోజే వెలవెలబోయేలా చేశాయి. మార్నింగ్ షోలకు ఫుల్స్ పడలేదు. ఆ షోలు అయ్యేసరికే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోవడంతో మ్యాట్నీల టైంకే పరిస్థితి దారుణంగా తయారైంది. వీకెండ్లో కూడా సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు.

‘థాంక్యూ’ ఫుల్ రన్ వసూళ్లు చైతూ స్టార్ పవర్‌ను ప్రశ్నార్థకం చేసేలా ఉండబోతున్నాయి. ఎవరో ఒకరి ప్యాడింగ్ ఉంటే తప్ప చైతూ సినిమాకు ఓపెనింగ్స్ రావు అనే చర్చ ఇప్పుడు నడుస్తుండడం గమనార్హం. ‘మజిలీ’కి సమంత, ‘లవ్ స్టోరి’కి సాయిపల్లవి, ‘బంగార్రాజు’కు నాగార్జున ప్లస్ అయ్యారు కాబట్టే అవి బాగా ఆడాయని, ఇప్పుడు చైతూకు అలాంటి సపోర్ట్ లేక ఓపెనింగ్స్ దగ్గర దెబ్బ తిన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘థాంక్యూ’కు పేలవ ఓపెనింగ్స్ రావడానికి వేరే కారణాలు కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరే హైలైట్ అవుతోంది.