అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా ముట్టచెపుతాం
ఈ డైలాగ్ దాదాపుగా ఓ రెండేళ్ల కిందట వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పింది…ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నది!. తమపై కక్షగట్టి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఒకే కారణంతో ఈ రెండు పార్టీలు సేమ్ డైలాగ్‌ను వాడేశాయి. అయితే, తాజాగా ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ చర్యలను ఎదుర్కునేందుకు ఏకంగా నియోజకవర్గానికి ఓ లాయర్‌ను పెట్టేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిసైడయ్యారట.
ప్రజాక్షేత్రంలో ఎలా మాటల యుద్ధం జరుగుతుందో…ఆన్‌లైన్‌లోనూ టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఇదే రీతిలో కామెంట్ల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని, అసభ్య వ్యాఖ్యలను సహించేది లేదంటున్న సర్కార్.. సామాజిక మాధ్యమాల్లోని పోస్ట్‌లపై కఠినంగానే వ్యవహరిస్తోంది. దీంతో కేసులు నమోదై.. అరెస్ట్‌ల దాకా వెళ్తున్నాయి. అయితే, దీనితో తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకింత సైలెంట్ అయిపోదామని డిసైడవుతున్నారు. దీంతో కేడర్‌ను కాపాడుకునే పని టీడీపీకి సవాల్‌గా మారిందట. ఇందుకోసం పార్టీ రథసారథి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చ, రాజకీయ కారణాలతో కావచ్చు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదైన విషయంలో వారికి అండగా ఉండేందుకు టీడీపీ ముఖ్యులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 మంది లాయర్లను నియమించుకోవాలని, కేసులు ఎదుర్కుంటున్న వారిని ఆదుకోవాలని నేతలకు టీడీపీ అధిష్టానం సూచించిందట. ఇలా నియోజకవర్గానికో లాయర్ ఏర్పాటు చేసి వీరిని కేంద్ర కార్యాలయంలో లీగల్ టీమ్‌తో సమన్వయం చేయనున్నారట. పార్టీకి సన్నిహితంగా ఉండే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదైతే…ఈ లాయర్లకు సమాచారం అందితే వెంటనే స్పందించేలా నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు. బాబు తీసుకున్న ఈ కీలక నిర్ణయం పార్టీ నేతల దూకుడు కొనసాగించేందుకు ఉపకరిస్తుందా? ఏపీ సీఎం జగన్ టీం దీనిపై ఎలా స్పందిస్తుంది? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.