టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత అనుభవజ్ఞులైన, యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా సురేష్ బాబు పేరు చెప్పేయొచ్చు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన సినిమాల్లోనే ఉన్నారు. తన తండ్రి రామానాయుడి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ సిినీ నిర్మాణాన్ని, స్టూడియోను నడిపిస్తున్నారాయన.
ట్రెండ్‌కు తగ్గట్లుగా అప్ డేట్ అవుతూ.. న్యూ వేవ్ సినిమాలూ తీస్తున్నారాయన. తాజాగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై మంచి విజయాన్నందుకున్న ట్రెండీ మూవీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సురేష్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిందే. గత కొన్నేళ్లుగా ఆచితూచి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తూ చాలా వరకు మంచి ఫలితాలే అందుకున్నారాయన. ఐతే ఇంత విజయవంతంగా కొనసాగుతూ కూడా సినీ నిర్మాణం పట్ల చాలా వైరాగ్యంతోనే ఉన్నారు సురేష్ బాబు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంత అనుభవం ఉన్న మీకు దర్శకత్వం చేపట్టే ఉద్దేశం లేదా అని అడిగితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల నిర్మాణం కొనసాగిస్తానో లేదో తెలియట్లేదు అనేశారు సురేష్ బాబు. ‘‘అసలీ కరోనా పరిస్థితుల్ని చూస్తుంటే మళ్లీ సినిమాలు నిర్మిస్తామో లేదో అన్న భయాలు కలుగుతున్నాయి. ఇంకా దర్శకత్వం కూడానా? ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతాం.. అసలిది ఎప్పటికి అదుపులోకి వస్తుంది.. అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కరోనా నుంచి బయటపడే వరకు సినీ పరిశ్రమతో పాటు అన్ని రంగాలకూ ఇబ్బందులు తప్పవు’’ అన్నారు సురేష్ బాబు.
కరోనా వల్ల దారుణంగా దెబ్బ తిన్న ఇండస్ట్రీల్లో సినీ రంగం కూడా ఒకటి. ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన సినిమాలు.. షూటింగ్ మధ్యలో ఉన్నవి.. ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్నవి.. అన్నింటి పైనా దీని ప్రభావం పడింది. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతే ఇంత మాట అన్నారంటే.. ఇక మామూలు ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.