క్రియేటివ్ దర్శకుడి మీద అంత పెట్టుబడా

ఒకప్పుడు దర్శకుడు కృష్ణవంశీ అంటే ఒక బ్రాండ్. డెబ్యూ మూవీ గులాబీతో యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ నిన్నే పెళ్లాడతాతో ఫ్యామిలీస్ లోనూ తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక మురారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ మహేష్ బాబు టాప్ 3 బెస్ట్ పెర్ఫార్మన్స్ లో దాని చోటు పదిలం. చందమామ ఒక చక్కని క్లాసిక్. కాకపోతే ఇదంతా గత చరిత్ర. ఆ తర్వాత ఓవర్ సెంటిమెంట్ డ్రామాతో సరైన కంటెంట్ లేక వరస ఫెయిల్యూర్స్ కొనితెచ్చుకుని చేజేతులా మార్కెట్ తగ్గించుకున్నారు.

ఇప్పుడు ఆయన చేస్తున్న రంగమార్తాండ చివరి దశకు వచ్చింది. విడుదలకు రెడీ చేస్తున్నారు. విపరీతమైన జాప్యం జరిగిన ఈ ప్రాజెక్టు మీద బిజినెస్ పరంగా పెద్దగా క్రేజ్ రాలేదు కానీ రిలీజయ్యాక కంటెంట్ మాట్లాడుతుందనే నమ్మకంతో కృష్ణవంశీ ఉన్నారు. ఇళయరాజా సంగీతం, ప్రకాష్ రాజ్ – రమ్యకృష్ణ – బ్రహ్మానందం – అనసూయ లాంటి క్యాస్టింగ్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీని ఫలితం వచ్చాకే గతంలోనే అనౌన్స్ చేసిన అన్నం ఉంటుందా లేదా అనే క్లారిటీ రావొచ్చు. తాజాగా ఈయనో కొత్త ట్విస్ట్ చెప్పారు.

త్వరలో తానో వెబ్ సిరీస్ చేయబోతున్నానని మూడు వందల కోట్ల బడ్జెట్ తో ఉండొచ్చని చెప్పి షాక్ ఇచ్చారు. నిజానికి మన తెలుగు దర్శకుల మీద అంత పెట్టుబడి పెట్టే సాహసం ఓటిటిలు చేయడం లేదు ఫ్యామిలీ మ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ కే అంత ఖర్చు కాలేదు. పైగా క్యాస్టింగ్, డైరెక్టర్ మీద అంత క్రేజ్ ఉన్నప్పటికీ ప్రైమ్ ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే చేసింది. అలాంటిది కృష్ణవంశీ మీద భారీ మొత్తమంటే మాములు సాహసం కాదు. ఇది రంగమార్తాండని చర్చల్లో ఉంచేందుకు అన్న మాటలా లేక నిజంగా అంత సీన్ ఉందానేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి.