చిరంజీవితో కుద‌ర్లేదు.. ప్ర‌భాస్‌తో చేస్తా

పృథ్వీరాజ్ సుకుమార‌న్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. ఈ మ‌లయాళ న‌టుడు ఇప్ప‌టికే తెలుగులో పోలీస్ పోలీస్ అనే సినిమా చేశాడు. డ‌బ్బింగ్ సినిమాల‌తోనూ మ‌న ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ మ‌ధ్య ఓటీటీల పుణ్య‌మా అని అత‌డి మ‌ల‌యాళ చిత్రాల‌కు కూడా మ‌న ద‌గ్గ‌ర మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇప్పుడత‌ను క‌డువా అనే పాన్ ఇండియా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. దీని టీజ‌ర్ లాంచ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన పృథ్వీరాజ్.. తెలుగులో డైరెక్ట్ మ‌ళ్లీ ఎప్పుడు సినిమా చేస్తార‌నే ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర రీతిలో స‌మాధానం ఇచ్చాడు.

ప్ర‌భాస్ కొత్త చిత్రం స‌లార్‌లో ఓ కీల‌క పాత్ర‌కు త‌న‌ను రెండేళ్ల ముందు అడిగార‌ని.. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ న‌రేష‌న్‌కు ఫిదా అయిపోయి వెంట‌నే ఓకే చెప్పేశాన‌ని.. కానీ త‌ర్వాత క‌రోనా కార‌ణంగా షెడ్యూళ్ల‌న్నీ మారిపోవ‌డం, మ‌ల‌యాళంలో త‌న‌కు వేరే క‌మిట్మెంట్లు ఉండ‌డంతో ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాన‌ని పృథ్వీరాజ్ వెల్ల‌డించాడు.

ఐతే త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా షెడ్యూళ్లు, డేట్ల‌లోనూ మార్పు జ‌ర‌గ‌డం, తాను ఈ సినిమాలో న‌టించాల్సిందే అని ప్ర‌భాస్, ప్ర‌శాంత్ ప‌ట్టుబ‌డ‌డంతో ఈ దిశ‌గా సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. తాను శ‌నివారం రాత్రే ప్రశాంత్‌ను క‌లుస్తున్నాన‌ని.. డేట్లు స‌ర్దుబాటు అయితే క‌చ్చితంగా ఈ సినిమాలో న‌టిస్తాన‌ని పృథ్వీరాజ్ స్ప‌ష్టం చేశాడు. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో గొప్ప ప్థాయికి ఎదిగింద‌ని, ఇక్క‌డి ప్రేక్ష‌కుల అభిమానం వెల‌క‌ట్ట‌లేనిద‌ని, ఇక్క‌డి సినిమాల్లో భాగం కావ‌డం త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని అత‌న‌న్నాడు.

చిరంజీవి తాను తీసిన లూసిఫ‌ర్ మూవీ తెలుగు రీమేక్ కోసం త‌న‌నే ముందు అడిగార‌ని, ఖాళీ లేక చేయ‌లేదని.. త‌న ఇమేజ్‌కు బాగా సూట‌య్యే ఈ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో చేస్తుండ‌టం సంతోష‌మ‌ని, తాను తీయ‌బోతున్న లూసిఫ‌ర్-2ను తెలుగులో రీమేక్ చేయ‌మ‌ని చిరు అడిగితే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని పృథ్వీరాజ్ తెలిపాడు.