మాములుగా బాక్సాఫీస్ వద్ద ఒకటి రెండు సినిమాలు పోటీ పడితేనే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం ఉంటున్న రోజులివి. అలాంటిది ఏకంగా తొమ్మిది పది ఒకేసారి బరిలో దిగడం అంటే అర్థం లేని రిస్క్ చేయడమే. కనీసం థియేటర్ అద్దెలు వసూలయ్యే కలెక్షన్ అయినా రావాలిగా.
కానీ కొందరు నిర్మాతలు అదేమీ ఆలోచించడం లేదు. స్క్రీన్లు తక్కువ దొరికినా డిస్ట్రిబ్యూటర్లతో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా ముందు రిలీజైతే చాలనే రీతిలో ముందుకెళ్తున్నారు. నాలుగైదు థియేటర్లే ఉండే ఊళ్ళలో కొన్ని అసలు దర్శనమిచ్చే ఛాన్సే లేదు.
దీనికి కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ఓటిటి డీల్స్. గతంలోలా ఇప్పుడు డిజిటల్ సంస్థలు గుడ్డిగా సినిమాలు కొనేయడం లేదు. నాలుగైదు దెబ్బలు తిన్నాక అవి జాగ్రత్తగా ఉంటున్నాయి. బల్క్ గా ఇంత మొత్తాన్ని ఇస్తామని చెప్పడం లేదు. ముందు రిలీజ్ చేయండి ఆ తర్వాత రేట్ డిసైడ్ చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడ సదరు ఓటిటిలు ఆయా చిత్రాల ఫలితాలను నిశితంగా గమనిస్తున్నాయి. పబ్లిక్ టాక్స్, రివ్యూలు, సోషల్ మీడియా ట్రెండ్స్ వీటిని విశ్లేషించడానికి ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ పని చేస్తున్నాయి.
ఇవి ఇచ్చే రిపోర్ట్స్ ని బట్టే ధర ఫైనల్ అవుతుంది. థియేటర్ లో ఎన్ని రోజులు ఆడిందన్నది ప్రతిసారి పరిగణించరు. జస్ట్ షోలు పడితే చాలు. ఫెయిల్యూర్ కి చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి అసలైతే చూసిన కొద్ది జనం కూడా కంటెంట్ గురించి ఏమనుకుంటున్నారనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. అందుకే కొన్ని మీడియం బడ్జెట్, చిన్న సినిమాలు ఇష్టం లేకపోయినా నానా తిప్పలు పడి ఎదురుఖర్చు పెట్టుకుని బిగ్ స్క్రీన్ రిలీజ్ కు వెళ్తున్నారు. దీనివల్ల ఫలాలు దక్కేది కొందరికే. మిగిలినవాటి అదృష్టం దేవుడికెరుక.