నిర్మాతగా నాని పంట పండిందిగా..

నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ మధ్య ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తున్నాడు. కరోనా టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. ఓటీటీల బాట పట్టిన ‘వి’, ‘టక్ జగదీష్’ చిత్రాలు అతడి క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీశాయి. ఆ ప్రభావం ‘శ్యామ్ సింగ రాయ్’ మీద కూడా కాస్త పడింది. ఈ సినిమాకు చాలా మంచి టాక్ రాగా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఐతే ఓవరాల్‌గా అది బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ మూవీగా నిలబడింది.

ఇక ఇప్పుడేమో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో నాని ప్రేక్షకుల ముందుకు రాగా.. ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా మిగిలేలా కనిపిస్తోంది. మొత్తానికి నాని మార్కెట్ కొంత మేర దెబ్బ తిన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తర్వాతి చిత్రాల విషయంలో నేచురల్ స్టార్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఐతే హీరోగా నాని కెరీర్ కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చేమో కానీ.. నిర్మాతగా మాత్రం అతడికి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తోంది.

ఇప్పటికే అతను తన సొంత బేనర్లో ‘అ!’, ‘హిట్’ చిత్రాలను నిర్మించాడు. అవి రెండూ అతడికి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు నానితన అక్క దీప్తి గంట దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. పెట్టుబడి మీద మంచి లాభానికే సినిమాను అమ్మేశారట. మరోవైపు నాని బేనర్లో ‘హిట్-2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

‘హిట్’కు కొనసాగింపుగా వస్తున్న చిత్రం కావడం, పైగా అడివి శేష్ ఇందులో లీడ్ రోల్ చేయడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే శేష్ ‘మేజర్’ కెరీర్లోనే అతి పెద్ద విజయం అందుకున్నాడు. ఒక్కసారిగా అతడి మార్కెట్ బాగా పెరిగిపోయింది. అతడి గత సినిమాలతో పోలిస్తే ఇది మూణ్నాలుగు రెట్లు ఎక్కువ వసూల్లు రాబట్టింది. పాన్ ఇండియా లెవెల్లో శేష్‌కు గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ‘హిట్-2’ బిజినెస్ పెద్ద స్థాయిలో జరగడం, విడుదలకు ముందే నాని భారీ లాభాలు అందుకోవడం ఖాయం. మొత్తానికి హీరోగా కెరీర్ ఎలా ఉన్నప్పటికీ.. నిర్మాతగా మాత్రం నానీకి బాగానే కలిసొస్తోంది.