హిట్టు లేదు.. కానీ పారితోషకం పెరిగింది

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన గోపీచంద్‌కు కెరీర్లో ఒక దశ వరకు మంచి విజయాలే ఉన్నాయి. యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం లాంటి చిత్రాలతో అతను బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకున్నాడు. కానీ ‘లౌక్యం’ తర్వాత గోపీచంద్‌కు సరైన విజయమే దక్కలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సీటీమార్’ సినిమా కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కానీ టాలీవుడ్లో కల్చర్ ఏంటంటే.. కాస్త ఇమేజ్ ఉన్న హీరోలందరికీ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా పారితోషకాలు పెరిగిపోతుంటాయి. గోపీచంద్ కూడా అందుకు మినహాయింపు కాదు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా అతను తన పారితోషకం గురించి మాట్లాడాడు. కెరీర్లో తొలిసారిగా ‘జయం’ సినిమాలో విలన్ పాత్రకు గాను కేవలం రూ.11 వేలు పారితోషకం తీసుకున్నట్లు వెల్లడించిన గోపీచంద్.. ‘పక్కా కమర్షియల్’ సినిమాకు అత్యధికంగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు వెల్లడించాడు. కానీ ఆ పారితోషకం ఎంతన్నది గోపీచంద్ వెల్లడించలేదు. హిట్టు తర్వాత ఆటోమేటిగ్గా పారితోషకం పెరుగుతుంది కదా అంటూ ‘పక్కా కమర్షియల్’కు అత్యధికంగా పుచ్చుకున్నట్లు తెలిపాడు. కానీ గోపీచంద్ చివరి సినిమా ‘సీటీమార్’ ఫ్లాప్ అన్నది బాక్సాఫీస్ పండిట్ల మాట.

ఇక తన శైలికి భిన్నమైన మారుతితో ‘పక్కా కమర్షియల్’ చేయడం గురించి మాట్లాడుతూ.. మారుతి ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వినోదాత్మక సినిమాలు తీస్తాడని, దానికి తన శైలి యాక్షన్ కూడా తోడైతే ఇంకా పెద్ద సక్సెస్ సాధించవచ్చన్న ఉద్దేశంతో అతడితో సినిమా చేసినట్లు తెలిపాడు. మారుతి చాలా స్పీడు అని, అతడి శైలికి అలవాటు పడడానికి రెండు రోజులు టైం పట్టిందని.. తాను చిన్న మార్పు కూడా చెప్పడానికి అవకాశం లేకుండా అతను అద్భుతమైన స్క్రిప్టుతో ఈ సినిమాను తీర్చిదిద్దాడని గోపీ చెప్పాడు.