వాళ్లు కోరుకున్నది పవన్ చెప్పేశాడుగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అంటే సుందరానికీ’ వేడుకకు ముఖ్య అతిథిగా వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా హీరో నాని.. పవన్‌కేమీ సన్నిహితుడు కాదు. ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయతోనూ పరిచయం లేదు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఒక సినిమాకు కమిట్మెంట్ ఉంది తప్ప ఇప్పటిదాకా ఆ బేనర్లో సినిమా అయితే చేయలేదు. తన కుటుంబ కథానాయకుల సినిమాల వేడుకలకే రాని పవన్.. ఈ సినిమా వేడుకకు రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ మైత్రీ అధినేతలు పట్టుబట్టి.. దర్శకుడు హరీష్ శంకర్‌కు చెప్పించి మరీ పవన్‌ను ఈ వేడుకకు రప్పించారు.

నిజానికి ఇది బుధవారం జరగాల్సిన ఈవెంట్. కానీ పవన్ కోసమని గురువారం పెట్టారు. విడుదలకు కొన్ని గంటల ముందు ఇలా ఈవెంట్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదంతా పవన్‌ను కచ్చితంగా ఈ ఈవెంట్‌కు రప్పించడం కోసమే.

మైత్రీ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకుడిగా పవన్ చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా విషయంలో విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఈ సినిమా గురించి ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలే వస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా తప్పుకుందని.. సినిమా ఇంకా ఆలస్యం కానుందని.. అసలుంటుందా లేదా అని.. ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ ప్రచారాలకు తెరదించి సినిమా కచ్చితంగా ఉంటుందని పవన్‌తో చెప్పించడానికి, ఆయన్నుంచి పరోక్షంగా ఒక కమిట్మెంట్ తీసుకోవడానికే మైత్రీ అధినేతలు ఇలా ప్లాన్ చేశారు. వాళ్లు కోరుకున్నట్లే పవన్ కూడా ఆ సినిమా ప్రస్తావన తెచ్చాడు.

మైత్రీ బేనర్లో హరీష్ దర్శకత్వంలో అతి త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా మొదలవుతుందని చెప్పాడు. మరి ఇలా ఓ వేడుకలో ఆ మాట చెప్పాడంటే పవన్ నిలబెట్టుకోవాల్సిందే. వచ్చే ఏడాది ఎన్నికలుంటాయన్న అంచనాల నేపథ్యంలో పవన్ ఎక్కడ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తాడేమో అన్న భయం మైత్రీ వారిలో ఉంది. అందుకే పవన్‌‌ను ఇలా కమిట్ చేయించేశారు. అభిమానులకు కూడా ఇది సంతోషం కలిగించే విషయమే. ఇక హరీష్ శంకర్‌కు ఇదెంత పెద్ద రిలీఫో చెప్పాల్సిన పని లేదు.