టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆర్య మొదలుకుని పుష్ప వరకు ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం కనిపిస్తుంది. ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ మూవీతో కూడా గౌరవం సంపాదించుకున్న దర్శకుడాయన. సినిమా కోసం ఆయనెంత తపిస్తారో.. ఎంత కష్టపడతారో సన్నిహితులకే తెలుసు. ఒక సినిమా పని మొదలైతే పని రాక్షసుడిగా మారిపోతారని.. నిద్రాహారాలు పట్టించుకోరని.. రేయింబవళ్లు ఆ సినిమా తాలూకు ఆలోచనలతోనే ఒక ట్రాన్స్‌లో ఉంటారని దగ్గరి వాళ్లు చెబుతారు.
ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బ తిందన్నది సన్నిహితుల మాట. వెన్ను నొప్పితో పాటు కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతోనూ సుకుమార్ బాధ పడుతున్నాడని.. ఈ మధ్య కేరళకు కూడా వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారని సమాచారం.
మామూలుగా అయితే ఈ చర్చ ఎప్పుడూ ఉండదు కానీ.. నిన్న ‘అంటే సుందరానికీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వయంగా సుకుమార్ తన అనారోగ్యం గురించి ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్‌తో తనకున్న రెండు అనుభవాల గురించి చెబుతూ.. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ టైంలోనే తాను ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటూ ఆయన్ని కలిశానని.. ఆ సందర్భంగా తాను ఆయాస పడుతూ కనిపించడం చూసి తనకేదో అనారోగ్య సమస్యలున్నట్లు భావించి త్రివిక్రమ్‌తో ఈ సంగతి చెప్పి పంపారని సుకుమార్ వెల్లడించాడు.
ఐతే పవన్‌ను చూసిన ఆనందంలోనే తాను ఆయాసపడినట్లు సుకుమార్ ఈ విషయాన్ని కవర్ చేశారు. అంతలోనే తాను ఇప్పుడు యోగా చేయడం ద్వారా బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ఐతే సుక్కు సన్నిహితులు మాత్రం ఆయన సినిమాల ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని.. పవన్ సరిగానే ఆయన పరిస్థితిని గుర్తించారని.. అప్పట్నుంచి ఆయన కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారని, కానీ ఇంకా ఆయన కాస్త మారాల్సి ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates