సూపర్ స్టార్ ట్రిపుల్ ధమాకా

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరి సినిమా రిలీజైంది 2018 డిసెంబర్లో. అంటే షారుఖ్ స్క్రీన్ మీద కనిపించి మూడున్నరేళ్లు అవుతోంది. వచ్చే ఆరు నెలల్లో కూడా షారుఖ్ కొత్త సినిమా ఏదీ రిలీజయ్యే సంకేతాలేమీ కనిపించడం లేదు. అంటే నాలుగేళ్ల పాటు షారుఖ్ వెండితెర దర్శనం లేదన్నట్లే అన్నమాట. ఈ స్థాయి హీరో ఇంత గ్యాప్ తీసుకోవడం కనీ వినీ ఎరిగి ఉండం. మరి వరుసబెట్టి డిజాస్టర్లు ఎదురవుతుంటే.. షారుఖ్ అయినా ఏం చేస్తాడు.

ఇంకో ఫ్లాప్ వస్తే కెరీర్ ఇంకా పతనం అయిపోతుందని భయపడి.. బాగా టైం తీసుకుని కొత్త సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తూ వచ్చాడు. వార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో గత ఏడాదే షారుఖ్ ‘పఠాన్’ అనే సినిమాను మొదలుపెట్టడం తెలిసిందే. కొన్ని నెలల కిందట రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ‘డంకి’ అనే మరో సినిమాను కూడా షారుఖ్ అనౌన్స్ చేశాడు. ఇక కొన్ని రోజుల కిందట తమిళ డైరెక్టర్ అట్లీతో ‘జవాన్’ సినిమాను కూడా ప్రకటించడం తెలిసిందే.

ఈ మూడు చిత్రాల్లో ఏదీ ఈ ఏడాది రిలీజ్ కాబోవు. వచ్చే ఏడాదే ఈ మూడు చిత్రాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయిపోవడం విశేషం. ‘డంకి’ మూవీని 2023 క్రిస్మస్‌కు రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ‘జవాన్’ మూవీని వచ్చే ఏడాది జూన్ 3కు  ఫిక్స్ చేశారు.

ఇక ‘పఠాన్’ సినిమా సంగతే తేలాల్సి ఉంది. ఈ చిత్రాన్ని 2023 జనవరి 26న గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ఏడాది ఆరంభంలో ఒకటి, మధ్యలో ఒకటి, చివర్లో ఒకటి.. ఇలా ఏడాది మొత్తం షారుఖ్ అభిమానులకు సంబరాలే అన్నమాట. నాలుగేళ్ల గ్యాప్‌ను కవర్ చేసేలా షారుక్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోనే రంగంలోకి దిగుతున్నాడన్నమాట.