టాలీవుడ్ క్రెడిట్ బాలీవుడ్‌కు కట్టబెడుతున్నారు


రాజమౌళి బెస్ట్ మూవీ ఏది అంటే.. అందరూ ‘బాహుబలి’ అంటారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రకంపనలు.. ఆ యుఫోరియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను అంతగా ఉర్రూతలూగించినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయిలో దానికి ఆశించినంత గుర్తింపు దక్కలేదు. యుఎస్ లాంటి దేశాల్లో భారీ వసూళ్లు రాబట్టినా అవి ఇండియన్ ప్రేక్షకుల ద్వారా వచ్చినవే. జపాన్‌ లాంటి కొన్ని దేశాల్లో మాత్రం అక్కడి వారిని ఆకట్టుకుందీ సినిమా.

ఐతే ‘బాహుబలి’తో పోలిస్తే తక్కువ అనిపించిన మన వాళ్లకు తక్కువగా అనిపించిన ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు మామూలుగా లేవు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు, నేటివ్ అమెరికన్స్ ఈ సినిమా చూసి వెర్రెత్తిపోతున్నారు. నెట్ ఫ్లిక్స్ల్ ఈ సినిమా చూసి కోట్లాది మంది ఎగ్జైట్ అయిపోతున్నారు. థియేట్రికల్ రన్ ముగిశాక డిజిటల్ రిలీజ్ తర్వాత దీనికి వస్తున్న రెస్పాన్స్ అలా ఇలా లేదు.

అందులోనూ ఇటీవల యుఎస్‌లో encoRRReపేరుతో మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ మామూలుగా లేదు. ఫేమ‌స్ హ‌లీవుడ్ సూప‌ర్ హీరోల సినిమాలు చూస్తున్న‌పుడు ఉండే యుఫోరియా థియేట‌ర్ల‌లో క‌నిపిస్తోంది. ఇక నెట్ ఫ్లిక్స్ సౌల‌భ్యంతో టీవీల్లో చూస్తున్న వారి ఎగ్జైట్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది.

ఐతే అంతా బాగుంది కానీ.. ఇలా ఎగ్జైట్ అవుతున్న వాళ్లంద‌రూ బాలీవుడ్ ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. ఇంగ్లిష్ సినిమాల‌న్నింటినీ హాలీవుడ్ మూవీస్ అన్న‌ట్లే.. ఇండియ‌న్ సినిమాలంటే బాలీవుడ్ అనే అభిప్రాయం విదేశీయుల్లో ఉంది. ముందు నుంచి దేశం బ‌య‌ట‌ హిందీ సినిమానే ఇండియ‌న్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తూ వ‌చ్చింది బాలీవుడ్. మ‌న ద‌గ్గ‌ర వివిధ భాష‌ల్లో పెద్ద ఎత్తున సినిమాలు తీస్తార‌ని.. ఇప్పుడు బాలీవుడ్‌ను తొక్కి ప‌డేస్తూ తెలుగు స‌హా ప్రాంతీయ భాషా చిత్రాలు ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నాయ‌ని.. వాళ్ల‌కు తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే చాలామంది ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా అని తెలియ‌క బాలీవుడ్ పేరు పెట్టి పొగ‌డ్త‌లు గుప్పిస్తున్నారు. ఇలా ఒక యుఎస్ సెల‌బ్రెటీ ఆర్ఆర్ఆర్‌ను బాలీవుడ్ మూవీగా పేర్కొంటూ ప్ర‌శంస‌లు కురిపించ‌గా.. చాలామంది తెలుగు నెటిజ‌న్లు ఆ వ్యాఖ్య‌ల్ని ఖండించారు. అత‌డి క‌ళ్లు తెరిపించారు. దీంతో అత‌ను సారీ చెబుతూ వేరే ట్వీట్ పెట్టాడు.