టాలీవుడ్లో కొత్త పాన్ ఇండియా స్టార్!


టాలీవుడ్ టాప్ స్టార్లు ఒక్కొక్క‌రుగా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోతున్నారు. బాహుబ‌లితో ప్ర‌భాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ల‌లో ఒకడిగా ఎదిగిపోయాడు. సాహో, రాధేశ్యామ్ నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ ఆ ఇమేజ్ అలాగే కొన‌సాగుతోంది. ఇక పుష్ప‌తో అల్లు అర్జున్ ఊహించ‌ని విధంగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు, మార్కెట్ సంపాదించుకున్నారు.

ఐతే వీళ్లంద‌రూ ముందు నుంచే టాలీవుడ్లో టాప్ స్టార్లు. కానీ వీళ్ల‌లా స్టార్ ఇమేజ్ లేని యంగ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఆ హీరో ఎవ‌రో కాదు.. అడివి శేష్. క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు సినిమాల‌తో శేష్ ఇప్ప‌టికే తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవ‌లం అత‌డి పేరు చూసి సినిమాకు వెళ్లే ప్రేక్ష‌కులు పెద్ద సంఖ్య‌లోనే ఉన్నారు. త‌న‌కున్న క్రెడిబిలిటీని స‌రిగ్గా ఉప‌యోగించుకుంటూ 26/11 ముంబ‌యి దాడుల హీరో సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా మేజ‌ర్ మూవీ చేశాడు శేష్‌.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భ‌లేగా ప్ర‌మోట్ చేసి.. విడుద‌ల‌కు ముందే ప్రిమియ‌ర్స్ వేసి.. అంద‌రూ దీని గురించి చ‌ర్చించుకునేలా చేశాడు శేష్‌. ఇప్పుడు సినిమా రిలీజ్ త‌ర్వాత మంచి అప్లాజ్ వ‌స్తోంది సినిమాకు, శేష్‌కు. తొలి రోజు ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ రూ.14 కోట్ల దాకా గ్రాస్ రాబ‌ట్ట‌డం విశేషం. శేష్ స్థాయికి ఇది చాలా పెద్ద నంబ‌ర్. అత‌డి గ‌త సినిమా వ‌సూళ్ల‌తో పోలిస్తే తొలి రోజు ఇది ఐదు రెట్లు రాబ‌ట్టిందంటేనే సినిమా ఎంత పెద్ద రేంజికి వెళ్ల‌బోతోందో అర్థం చేసుకోవ‌చ్చు.

త‌మిళంలో విక్ర‌మ్, హిందీలో పృథ్వీరాజ్ లాంటి భారీ చిత్రాలు రిలీజైన నేప‌థ్యంలో మేజ‌ర్.. ఆయా మార్కెట్ల‌లో మ‌రీ ఎక్కువ వ‌సూళ్లేమీ రాబ‌ట్ట‌లేదు. ఓ మోస్త‌రుగానే ఉన్నాయి క‌లెక్ష‌న్లు. కానీ ఈ సినిమా అన్ని చోట్లా మంచి రివ్యూలు తెచ్చుకుంటోంది. శేష్‌కు మంచి గుర్తింపూ వ‌స్తోంది. అంతిమంగా మేజ‌ర్ తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల ఏ స్థాయి వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ప్ప‌టికీ.. శేష్‌కు ఒక మార్కెట్ అయితే క్రియేట‌వుతుంద‌న్న‌ది గ్యారెంటీ. అత‌డికి పాన్ ఇండియా ఇమేజ్ కూడా రావ‌చ్చు. అది త‌ర్వాతి సినిమాల‌కు ఉప‌యోగ‌ప‌డొచ్చు. ఇక్క‌డ పెద్ద స్టార్ కాక‌పోయినా, త‌న‌కు అండ‌గా ఏ పెద్ద డైరెక్ట‌ర్ లేక‌పోయినా.. కంటెంట్ బేస్డ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవ‌డం గొప్ప విష‌యం.