భారీ గ్యాప్ తర్వాత వస్తున్న పూరి తమ్ముడు 

ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉండాలి. హీరోకయినా రెగ్యులర్ గా సినిమాలు చేయడం చాలా ముఖ్యం. కాస్త గ్యాప్ ఇచ్చిన పక్కన పెట్టేస్తారు.  పూరి తమ్ముడు సాయిరాం శంకర్ గుర్తున్నాడు కదా. 143 సినిమాతో పూరి సాయి ని హీరోగా పరిచయం చేశాడు. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలతో హీరోగా బండి లాగించాడు.

‘బంపర్ ఆఫర్’ తో ఓ మోస్తారు హిట్ అందుకొని హమ్మయ్య అనుకున్నాడు. కానీ ఆ తర్వాత సాయి చేసిన సినిమాలేవి హిట్టవ్వలేదు. దాంతో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ మెల్లగా కనుమరుగయ్యాడు. కొన్నేళ్ళ క్రితం నుండి సినిమాలు చేయడం ఆపేశాడు. ఇప్పుడు రెండు మూడు సినిమాలతో మళ్ళీ హీరోగా బిజీ అయ్యాడు.

త్వరలోనే ‘ఒక పథకం ప్రకారం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ని రవితేజ రిలీజ్ చేశాడు. టీజర్ చూస్తే కంటెంట్ ఉన్న సినిమానే అనిపిస్తుంది. నిజానికి సాయిరాం హీరోగా క్లిక్ అవ్వలేదు కానీ అతనిలో టాలెంట్ ఉంది. నేనింతే సినిమాలో సాయి కనిపించేది కాసేపే అయినా ఇప్పటికీ ఆ పాత్ర అందరికీ గుర్తుండిపోయింది.

బంపర్ ఆఫర్ లో కూడా తన యాక్టింగ్ స్కిల్స్ చూపించి మెప్పించాడు. మరి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సాయి రామ్ శంకర్ ‘ఒక పథకం ప్రకారం’ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.