ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఇంకో బేనర్

టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద సినీ కుటుంబాల్లో నందమూరి వారిది ఒకటి. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. తన కుటుంబంలో తర తరాలకు ఉపయోగపడే లెగసీని అందించాడు. ఆయన ఘన వారసత్వాన్నందుకుని తర్వాతి రెండు తరాల్లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్లుగా ఎదిగారు.

కానీ నందమూరి కుటుంబం నుంచి ఇంకా చాలామంది నటనలోకి అడుగు పెట్టారు కానీ.. వాళ్లెవ్వరూ కూడా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. హరికృష్ణ కెరీర్ ఓ మోస్తరుగా సాగింది. కళ్యాణ్ రామ్ ఒడుదొడుకులతో ప్రయాణం సాగిస్తున్నాడు. అరంగేట్రంలో ఎంతో హడావుడి చేసిన తారకరత్న తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ అరంగేట్రం గురించి చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది కానీ.. ఆ దిశగా అడుగే ముందుకు పడడం లేదు.

ఇలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ హీరో రీ ఎంట్రీకి రెడీ అవుతుండటం విశేషం. ఆ కుర్రాడి పేరు కూడా చైతన్య కృష్ణనే. ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరైన జయకృష్ణ కొడుకే ఈ చైతన్య కృష్ణ. గతంలో ‘ధమ్’ అనే సినిమాతో పాటు ఇంకేదో చిన్న సినిమా ఒకటి చేశాడు. కానీ అవేవీ ఫలితాన్నివ్వలేదు. చాలా ఏళ్ల నుంచి అతను సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. కానీ ఇప్పుడు సొంత బేనర్లో హీరోగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబంలో రామకృష్ణ స్టూడియో, ఎన్టీఆర్ ఆర్ట్స్, ఎన్బీకే ఫిలిమ్స్.. ఇలా కొన్ని బేనర్లు చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరు మీద కొత్త బేనర్ పెట్టారు. బసవతారకమ్మ క్రియేషన్స్ పేరుతో నెలకొల్పిన ఈ బేనర్లో చైతన్య కృష్ణ సినిమా చేయబోతున్నాడు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ బేనర్లో కొత్త సినిమాను ప్రకటించబోతున్నారు. ఐతే ఆల్రెడీ ప్రేక్షకుల తిరస్కారానికి గురై, చాలా ఏళ్ల నుంచి లైమ్ లైట్లో లేని హీరో ఇప్పుడొచ్చి ఎలాంటి ప్రభావం చూపుతాడో చూడాలి.