బాలీవుడ్ ఇంకో హిట్టుకు రెడీ అయిన‌ట్లేనా?

బాలీవుడ్లో మ‌ళ్లీ కొంచెం గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఉత్సాహం క‌నిపిస్తోంది. అందుక్కార‌ణం.. భూల్ భూల‌యియా-2. కొవిడ్ కార‌ణంగా ఏడాదిన్న‌ర పాటు కుదేలైన థియేట‌ర్ల వ్య‌వ‌స్థ.. పునఃప్రారంభం త‌ర్వాత బాగా ఆడిన హిందీ చిత్రాలు సూర్య‌వంశీ, క‌శ్మీర్ ఫైల్స్ మాత్ర‌మే. మిగ‌తా సినిమాల‌న్నింటికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. అంత‌కంత‌కూ ప‌రిస్థితి దారుణంగా త‌యారై హిందీ చిత్రాల‌కు ఓపెనింగ్స్ కూడా క‌ష్ట‌మైపోతున్న స‌మ‌యంలో.. ఈ శుక్ర‌వారం విడుద‌లైన భూల్ భూల‌యియా-2 మ‌ళ్లీ ప్రేక్ష‌కులను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తోంది.

ఈ చిత్రానికి తొలి రోజు రూ.14 కోట్ల దాకా నెట్ వ‌సూళ్లు రావ‌డంతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. రెండో రోజు వ‌సూళ్లు ఇంకా పెరిగాయి. వీకెండ్లో ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును దాటడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇలాంటి టైంలోనే ఓ కొత్త సినిమా ట్రైల‌ర్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ సినిమా బాలీవుడ్‌కు ఇంకో హిట్ ఇస్తుంద‌న్న ధీమా అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఆ చిత్ర‌మే.. జ‌గ్ జ‌గ్ జీయో.

వ‌రుణ్ ధావ‌న్, కియారా అద్వానీ, అనిల్ క‌పూర్, నీతూ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్ర‌మిది. ఇందులో వ‌రుణ్‌-కియారా అప్పుడే పెళ్ల‌యిన యువ జంట‌గా న‌టించింది. కానీ పెళ్ల‌యిన కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చి విడాకులు తీసుకోవాల‌నుకుంటారు. ఒక పెళ్లి కోసమ‌ని భార్య‌తో క‌లిసి త‌మ ఇంటికి వ‌చ్చిన వ‌రుణ్‌.. స‌మయం చూసి త‌ల్లిదండ్రుల‌కు త‌మ విడాకుల గురించి చెప్పాల‌నుకుంటాడు. కానీ ఇక్క‌డొచ్చి చూస్తే మ‌రో మ‌హిళ మోజులో ప‌డ్డ హీరో తండ్రి (అనిల్ క‌పూర్‌) త‌న భార్య‌కు విడాకులు ఇవ్వాల‌నుకుంటాడు. దీంతో షాక్ తిన్న హీరో.. తండ్రి ఎక్క‌డ త‌ల్లి నుంచి విడిపోతాడో అని కంగారు ప‌డ‌టం, మ‌రోవైపు త‌మ విడాకుల గురించి అమ్మానాన్న‌ల‌కు ఎలా చెప్పాలో తెలియక స‌త‌మ‌తం కావ‌డం.. ఈ నేప‌థ్యంలో న‌డిచే డ్రామా ఆధారంగా సాగే సినిమా ఇది.

ట్రైల‌ర్ ఆద్యంతం స‌ర‌దాగా సాగ‌డం.. కొంచెం ఎమోష‌న‌ల్ ట‌చ్ కూడా ఉండ‌టంతో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అయ్యేలా క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ చూస్తే స్యూర్ షాట్ హిట్ లాగా క‌నిపిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్ న్యూజ్ ద‌ర్శ‌కుడు రాజ్ మెహ‌తా రూపొందించాడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌. ఈ నెల 24న జ‌గ్ జ‌గ్ జీయో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.