నిజ‌మా.. ప్ర‌శాంత్ నీల్‌తో నాని?


విన‌డానికి ఏమాత్రం న‌మ్మ‌శక్యంగా లేక‌పోవ‌చ్చు. కొంద‌రికి కామెడీగా కూడా అనిపింవ‌చ్చు. కానీ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. నేచుర‌ల్ స్టార్ నానితో జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం స‌లార్ చిత్రం చేస్తున్న ప్ర‌శాంత్.. దీని త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో జ‌ట్టు క‌డ‌తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. దాని త‌ర్వాత కేజీఎఫ్‌-3 ఉండొచ్చ‌న్న‌ది ప్ర‌స్తుతానికి ఉన్న అంచ‌నా.

కానీ ఎన్టీఆర్ సినిమా త‌ర్వాత‌.. నానితో ప్ర‌శాంత్ సినిమా చేస్తాడ‌ని.. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌లె ఫిలిమ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించ‌బోతోంద‌ని సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం విశేషం. కానీ అస‌లు ప్ర‌శాంత్ ఏంటి.. నానీతో సినిమా చేయ‌డ‌మేంటి అని నెటిజ‌న్లు విస్తుబోతున్నారు. ఎందుకంటే వీళ్లిద్ద‌రికీ ఏ ర‌కంగానూ సింక్ అయ్యే అవ‌కాశాలు లేవు.

ప్ర‌శాంత్ ఊర మాస్‌గా, హీరో ఎలివేష‌న్ల‌తో సినిమాలు తీస్తాడు. కేజీఎఫ్‌తో అత‌ను ఎంత పెద్ద స్థాయికి వెళ్లిపోయాడో తెలిసిందే. ఇక‌పై ప్ర‌శాంత్.. సూపర్ స్టార్ల‌తోనే సినిమాలు చేసేలా ఉన్నాడు. అత‌డితో సినిమా చేయ‌డానికి టాప్ స్టార్లు పోటీ ప‌డుతున్నారు.

తార‌క్ సినిమా అయ్యాక అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్లతో అత‌ను సినిమా చేసే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. మొత్తంగా మున్ముందు త‌న సినిమాల రేంజే వేరుగా ఉండ‌బోతోంది. అలాంటి ద‌ర్శ‌కుడు.. మీడియం రేంజ్ హీరో, పైగా మాస్ ఇమేజ్ లేని నానీతో సినిమా చేస్తాడ‌ని ఎవ‌రూ అనుకోరు. అస‌లు ఈ కాంబినేష‌న్ గురించి ఎవ‌రూ ఆలోచ‌న కూడా చేయ‌రు. అలాంటిది ఈ క‌ల‌యిక గురించి ఎందుకు ప్ర‌చారం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేదు. నిజంగా ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా.. లేక కావాలనే ఈ ప్ర‌చారం మొద‌లుపెట్టి.. ఈ వార్త‌ను వైర‌ల్ చేస్తున్నారా అన్న‌ది తెలియాల్సి ఉంది.