పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా దిల్ రాజు పేరు తెలియని వాళ్ళు సగటు తెలుగు ప్రేక్షకుల్లో ఎవరూ ఉండరు. తీసింది యాభై సినిమాలే అయినా అంతకు రెట్టింపు సంఖ్యలో ఎన్నో చిత్రాలను పంపిణి చేసి ఎన్నో ఆటుపోట్లు చూసిన అనుభవశాలి, ఆయన నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. మే 27న విడుదల కాబోతున్న ఎఫ్3 ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్న దిల్ రాజు కలెక్షన్లు, నెంబర్ల గురించి చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.
డిస్ట్రిబ్యూటర్లుగా తాము ప్రతి నిర్మాతకు కలెక్షన్ల ఫిగర్లు ఇస్తామని, వాటిని యధాతథంగా పోస్టర్లలో వేసుకుంటారని గ్యారెంటీ లేదని అర్థం వచ్చేలా చెప్పి షాక్ ఇచ్చారు. అది వాళ్ళిష్టమని ఇలాంటి వాటికి బ్రేక్ పడాలంటే ట్రాకింగ్ సిస్టం ఒకటే మార్గమని దాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో ఈ వీడియో బైట్ ని తీసుకుని సర్కారు వారి పాట, ఆర్ఆర్ఆర్ వసూళ్ల గురించి ఆయా ఫాన్స్ మీరంటే మీరు అబద్ధమంటూ ట్విట్టర్ తదితర సామజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు చేసుకుంటున్నారు.
చెప్పడం వరకు బాగానే ఉంది కానీ నిజంగా ఇది అమలుపరచడం సాధ్యమేనా అంటే అంత కాదనే సులభం చెప్పాలి. పైగా ఇప్పుడున్న ట్రెండ్ లో ఒకటి నాలుగు నెంబర్లు కలుపుకుని తమ సినిమా గొప్పగా ఆడుతుందని చెప్పుకుంటేనే అయిదారు టికెట్లు ఎక్కువ తెగుతున్నాయి. అలా కాకుండా యావరేజ్ లేదా ఫ్లాప్ మూవీ వచ్చినప్పుడు దానికంత డబ్బులు రాలేదనే మాట బయటికి వెళ్తే అదో నెగటివ్ పబ్లిసిటీగా మారే ప్రమాదం ఉంది. సో ట్రాకింగ్ వచ్చాక జరిగే పరిణామాలు ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టమే.