క‌మ‌ల్ తెలుగు ఫ్యాన్స్ టెన్ష‌న్ తీరిపోయింది

Kamal-Haasan-Vikram

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఆయ‌న కొత్త సినిమా విక్ర‌మ్ ఇంకో రెండు వారాల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గ‌త ద‌శాబ్ద కాలంలో ఆయ‌న చాలా త‌క్కువ సినిమాలు చేయ‌గా.. విశ్వ‌రూపం మిన‌హా ఏదీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు.

గ‌త కొన్నేళ్ల‌లో సినిమాల‌కు పూర్తిగా దూరమైపోయి అభిమానుల‌ను నిరాశ ప‌రిచిన క‌మ‌ల్.. లోకేష్ క‌న‌క‌రాజ్ లాంటి హాట్ షాట్ డైరెక్ట‌ర్‌తో జ‌ట్టు క‌ట్ట‌డం, ఇందులో విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్ లాంటి ఈ త‌రం మేటి న‌టులు కీల‌క పాత్ర‌లు పోషించ‌డంతో సినిమాపై అమితాస‌క్తి నెల‌కొంది.

జూన్ 3న భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ఐతే తెలుగులో ఈ సినిమా రిలీజ్ విష‌య‌మై గంద‌ర‌గోళం నెల‌కొంది. అల్లుడు అదుర్స్ లాంటి డిజాస్ట‌ర్ మూవీని నిర్మించిన, పెద్ద‌గా పేరు లేని నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇది క‌మ‌ల్ తెలుగు అభిమానుల‌ను కొంత నిరాశ ప‌రిచింది. తెలుగులో ప్రమోష‌న్లు కూడా లేక‌పోవ‌డం, ట్రైల‌ర్ కూడా ఇంకా లాంచ్ చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ఐతే వారి టెన్ష‌న్ తీర్చేసే అప్‌డేట్ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది.

విక్ర‌మ్ సినిమా తెలుగు రిలీజ్ వేరే బేన‌ర్‌ చేతికి వెళ్లింది. అది యువ క‌థానాయ‌కుడు నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ కావ‌డం విశేషం. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి పేరున్న డిస్ట్రిబ్యూట‌ర్. నైజాంలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. ఆంధ్రా ప్రాంతంలోనూ డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో మంచి సంబంధాలున్నాయి.

కాబ‌ట్టి విక్ర‌మ్ సినిమాను పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయ‌డానికి అవ‌కాశ‌ముంది. రాబోయే రెండు వారాల్లో ప్ర‌మోష‌న్లు కూడా గట్టిగా చేసే అవ‌కాశ‌ముంది. క‌మ‌ల్, ఫాహ‌ద్, సేతుప‌తి ఇక్క‌డికి వ‌చ్చారంటే సినిమాకున్న క్రేజ్ ఇంకా పెర‌గ‌డం ఖాయం. అడివిశేష్ సినిమా మేజ‌ర్‌తో ఈ సినిమా పోటీ ప‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే.