బాలీవుడ్లో కథలు పూర్తిగా అడుగంటిపోతున్నట్లున్నాయి. కొన్నేళ్లుగా వాళ్లు ప్రధానంగా రీమేక్‌ల మీదే ఆధారపడుతున్నాయి. వాటికే ఎక్కువ ఆదరణ దక్కుతుండటం కూడా వాటి పట్ల బాలీవుడ్ జనాలకు మోజు పెరగడానికి కారణం కావచ్చు. ఐతే రీమేక్ చేసినా.. కాస్త విషయం ఉన్న సినిమాలు, ప్రత్యేకమైనవి, కొత్తదనం ఉన్నవి ఎంచుకుంటే ఒక లెక్క. కానీ కమర్షియల్‌గా తెలుగులో బాగా ఆడింది కదా అని.. ఎంసీఏ అనే అతి సాధారణమైన సినిమాను కూడా హిందీ జనాలు వదలకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
నాని హీరోగా వేణు శ్రీరామ్ రూపొందించిన ఎంసీఏకు విమర్శకుల నుంచి తిరస్కారం ఎదురైంది. నాని అప్పుడు సూపర్ ఫాంలో ఉండడం, సాయిపల్లవితో అతడికి మంచి కాంబినేషన్ కుదరడం, పాటలు బాగుండటంతో సినిమాకు హైప్ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ నాని కెరీర్లో చాలా మామూలు సినిమాల్లో ఇదొకటనడంలో సందేహం లేదు.
ఇలాంటి సినిమాను హిందీలో రీమేక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. అభిమన్యు అనే కొత్త నటుణ్ని పెట్టి హీరోపంటి, బాగి చిత్రాల దర్శకుడు సబ్బీర్ ఖాన్ ఎంసీఏను రీమేక్ చేశాడు. ఆ సినిమా పేరు.. నికమ్మ. ఒరిజినల్లో భూమిక చేసిన వదిన పాత్రను హిందీలో శిల్పా శెట్టి చేసింది. సాయిపల్లవి పాత్రలో కృష్ణ వ్రింద విహారి హీరోయిన్ షెర్లీ నటించింది. జూన్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
అది మరీ పేలవంగా ఉండడంతో ఇంటర్నెట్లో ట్రోల్స్ తప్పట్లేదు. ట్రైలర్ కట్ విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం.. శిల్పా శెట్టిని పూర్‌గా ప్రెజెంట్ చేయడంతో అందరూ నెగెటివ్ కామెంట్లే చేస్తున్నారు. ఇమేజ్ లేని హీరోతో భారీ ఫైట్లు చేయించడం అతిగా ఉంది. పేరున్న హీరోలు చేసిన సినిమాలే హిందీలో తుస్సుమనిపిస్తుంటే.. ఇలాంటి సినిమా ఏం ఆడుతుందో చూడాలి మరి.