సినిమా నిర్మాణం విజయవంతంగా పూర్తి చేయడం ఒక ఎత్తయితే సరైన టైం చూసుకుని విడుదల చేసుకోవడంలోనే సదరు హీరో దర్శక నిర్మాతల తెలివితేటలు ఇమిడి ఉంటాయి. దానికి మంచి ఉదాహరణగా శివ కార్తికేయన్ నిలుస్తున్నాడు. కేవలం సర్కారు వారి పాటకు ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ అయినప్పటికీ డాన్ తక్కువ థియేట్ రికల్ బిజినెస్ తోనే తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యూత్ లో టాక్ పాజిటివ్ గా వెళ్లడంతో లిమిటెడ్ స్క్రీన్స్ లో ఊహించిన దానికన్నా వేగంగా కలెక్షన్లు పెరుగుతున్నాయి.
ఇక్కడి సంగతి పక్కనపెడితే తమిళంలో డాన్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. కెజిఎఫ్ 2 తర్వాత అక్కడ చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఏదీ రాలేదు. దీంతో డాన్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ని దట్టించడంతో దర్శకుడు సిబి చక్రవర్తికి డెబ్యూతోనే మంచి హిట్ దక్కింది. కొంచెం డ్రామా పాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కామెడీతో తమను నవ్వించడంతో ప్రేక్షకులు పాస్ చేశారు. ఒక్క తమిళం నుంచే ఆల్రెడీ 50 కోట్లు వచ్చేసాయి.
ఇతని లాస్ట్ సినిమా డాక్టర్ కూడా ఇదే తరహాలో ఓటిటి ఆఫర్లను వద్దనుకుని నెలల తరబడి వెయిట్ చేసి థియేటర్లో రిలీజై ఒరిజినల్ వెర్షన్ లో 80 కోట్లకు పైగానే రాబట్టింది. ఇది చూసే విజయ్, రజనీకాంత్ లు దాని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు ఆఫర్లు ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఎవరూ లేని టైంని చూసుకుని తన సినిమాలు విడుదల చేసుకుని మార్కెట్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్న శివ కార్తికేయన్ ఇప్పుడు టాలీవుడ్ ని టార్గెట్ చేసి జాతరత్నాలు ఫేమ్ అనుదీప్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.