ఓటీటీలు కూడా వాయించేస్తే ఎలా?

కొవిడ్ దెబ్బ‌కు అన్ని రంగాల మాదిరే సినీ రంగం కూడా కుదేలైంది. ఇంకా చెప్పాలంటే సినీ రంగానికి త‌గిలిన దెబ్బ పెద్ద‌ది. ఐతే తాము కోల్పోయిన న‌ష్టాన్ని, ఆదాయ‌న్ని ప్రేక్ష‌కుల నుంచి భ‌ర్తీ చేయ‌డానికి నిర్మాత‌లు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో మొద‌టికే మోసం వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

టికెట్ల ధ‌ర‌లను ఒక్క‌సారిగా 50 నుంచి 100 శాతం పెంచేయ‌డం.. దానికి తోడు తొలి ప‌ది రోజులు అద‌న‌పు రేట్లు బాదేస్తుండ‌టంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య త‌గ్గిపోతోంది. ఈ విష‌యంలో ఆడియ‌న్స్ చాలా ఆగ్ర‌హంతో ఉన్న సంగ‌తి తెలుస్తూనే ఉంది. నెమ్మ‌దిగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు దూర‌మై, ఓటీటీల వైపు మొగ్గుతున్నారు.

కానీ ఓటీటీలు సైతం థియేట‌ర్ల‌లోనే పయ‌నిస్తుండ‌టం ఇప్పుడు ప్రేక్ష‌కుల ఆగ్ర‌హాన్ని మ‌రింత పెంచుతోంది. థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో కొత్త సినిమాల‌ను పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేయ‌డం చూశాం. అలా రేటు పెట్టి కొత్త సినిమాను చూడ‌డంలోనూ కొంత అర్థం ఉంది.

కానీ ఆల్రెడీ థియేట‌ర్ల‌లో రిలీజై నెలా రెండు నెల‌లు దాటాక ఓటీటీల బాట ప‌డుతున్న చిత్రాల‌కు 100, 200 రేటు పెట్టి చూడాల్సి రావ‌డం ఏంట‌నే ఇప్పుడు త‌లెత్తుతోంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌-2 చిత్రాలకు ఇలాగే చేస్తున్నారు.

డిజిట‌ల్ ఫ్రీ ప్రిమియ‌ర్స్ కంటే ముందు ఈ చిత్రాల‌కు వేరేగా రేటు పెట్టి ఓటీటీల్లో చూసేలా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓటీటీల‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ క‌డుతూ.. మ‌ళ్లీ ఇలా సినిమాకు సినిమాకు వేరుగా రేటు పెట్టి చూడాల‌ని అడ‌గ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్రేక్ష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

థియేట‌ర్ల‌లో రేట్లు పెరిగాయ‌ని ఓటీటీల వైపు చూస్తే వాళ్లు కూడా ఆదాయం పెంచుకోవ‌డానికి క్రేజున్న సినిమాల‌కు కొత్త ష‌ర‌తులు పెడుతుండడం ప్రేక్ష‌కులకు రుచించ‌ట్లేదు. ఇలా రోజు రోజుకూ సినీ వినోదం ఖ‌రీదుగా మారిపోతుండ‌టం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

థియేట‌ర్ల‌లో అంతేసి రేట్లు పెట్టి భారీ ఆదాయం పొందాక మ‌ళ్లీ ఓటీటీల్లో ఇలా అద‌న‌పు బాదుడేంట‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలా చేస్తే ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు కూడా నెమ్మ‌దిగా గుడ్‌బై చెప్పేయ‌డం ఖాయం.