నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి స్పందన తెచ్చుకోవడంతో అఖండ-2ను బహు భాషల్లో చిత్రీకరించి, దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసింది చిత్ర బృందం. ఇందులోని కంటెంట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందనే అంచనాలున్నాయి. ఈ సినిమాకు హిందీ, తమిళంలో స్వయంగా బాలయ్యే డబ్బింగ్ చెప్పడం విశేషం. తొలిసారి ఆయన ఈ ప్రయత్నం చేశారు.
అంతే కాదు.. సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ఆయన తన బహు భాషా ప్రావీణ్యాన్ని చూపిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ముంబయిలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో అనర్గళంగా హిందీలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు బాలయ్య. ఆ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ ప్రోమోలో బాలయ్య పవర్ ఫుల్ హిందీ డైలాగులు విని అక్కడి మీడియా వాళ్లు ఆశ్చర్యపోయారు. తాజాగా హిందీ ప్రేక్షకుల కోసం బాలయ్య ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో హిందీ హోస్ట్ ప్రశ్నలకు ఆ భాషలోనే ఏమాత్రం తడబడకుండా సమాధానాలు చెప్పారు. మరోవైపు బాలయ్య అఖండ-2 తమిళ వెర్షన్ ప్రమోషన్ కోసం బుధవారం చెన్నైకి వెళ్లారు. అక్కడ బాలయ్య తమిళంలోనూ చక్కగా మాట్లాడారు. తనదైన శైలిలో నాన్ స్టాప్ స్పీచ్ ఇచ్చారు.
ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా మాత్రమే నటిస్తున్న హీరోని తనే అని చెప్పిన బాలయ్య.. తమిళనాడుతో, చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను పుట్టి పెరిగింది చెన్నైలోనే అని.. ఈ నగరంతో తనకున్నది మాతృ బంధం అని బాలయ్య చెప్పారు. తెలంగాణ తనకు కర్మభూమి అయితే.. ఆంధ్రప్రదేశ్‌తో తనకు ఆత్మ బంధం ఉందని బాలయ్య వ్యాఖ్యానించారు. బాలయ్య ప్రసంగం పూర్తిగా తమిళంలోనే సాగడం విశేషం. ఇలా తన బహు భాషా ప్రావీణ్యంతో బాలయ్య తన తొలి పాన్ ఇండియా మూవీని ఎక్కడికక్కడ బాగానే ప్రమోట్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates