5 ఏళ్ళ తర్వాత రీమేకా – రిస్కేమో

ఈ మధ్య టాలీవుడ్ దర్శక నిర్మాతలకు రీమేక్ ఫీవర్ బాగా పట్టుకుంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సైతం రెండు మూడు తమిళ మలయాళ పునఃనిర్మితాలు చేస్తూ వీలైనంత రిస్క్ తగ్గించుకుంటున్నారు. అసలే ఓటిటి కాలం. ఇప్పటి ఆడియన్స్ ఫలానా భాషలో ఏదైనా సినిమా బాగుందని తెలిస్తే చాలు వెంటనే ఓటిటికి వెళ్ళిపోయి సబ్ టైటిల్స్ సహాయంతో చూసేదాకా వదిలిపెట్టడం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఐదారేళ్ళ క్రితం వచ్చిన వాటిని ఇప్పుడు తడుముకోవడం అంటే ఖచ్చితంగా రిస్కేగా.

2018లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన రైడ్ బాలీవుడ్ లో పెద్ద హిట్టు. ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఒక ఊరిలో కోట్ల రూపాయల అక్రమాస్తులు, బ్లాక్ మనీ ఇల్లీగల్ గా సంపాదించుకుని దాచుకున్న పెద్దమనిషి ఇంటి మీదకు రైడింగ్ కు వెళ్లే ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కథ ఇది. కొద్దిగా సూర్య గ్యాంగ్ పోలికలు ఉంటాయి. ఆ మాటకొస్తే ఈ సూర్య మూవీ కూడా అక్షయ్ కుమార్ స్పెషల్ 26 రీమేకే. కాకపోతే నేపధ్యాలు దగ్గరగా అనిపించినా ట్రీట్మెంట్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే రెండూ హిట్టయ్యాయి.

ఇప్పుడీ రైడ్ ని తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆలోగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్ తాకేప్ చేయొచ్చనే టాక్ వినిపిస్తోంది. హీరో ఎవరనేది మాత్రం ఇంకా అనుకోలేదట. మెగా కాంపౌండ్ నుంచి ఒకరు ఉండొచ్చని సమాచారం. ఎలాగూ భారీ బడ్జెట్ అవసరం లేని రైడ్ లాంటి వాటిని త్వరగానే ఫినిష్ చేయొచ్చు. ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజిలో ఉన్న ఈ రైడ్ రీమేక్ గురించి ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది