మురారి బావని జోడిస్తారట

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట విజయవంతంగా మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. కేవలం నాలుగు రోజులకే యుఎస్ లో 2 మిలియన్ల మార్కు అందుకుని మహేష్ నాలుగోసారి ఆ ఘనతను సాధించేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు బాగున్నాయి కానీ మరీ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో లేవన్నది వాస్తవం. మెజారిటీ కేంద్రాల్లో హౌస్ ఫుల్స్ బోర్డులు పడ్డ మాట వాస్తవమే. అయితే టికెట్ రేట్ల కారణంగా బిసి సెంటర్లలో సూపర్ స్టార్ రేంజ్లో కనిపించాల్సిన దూకుడు లేదన్న మాట వాస్తవం.

కలెక్షన్ గ్రాఫ్ పడిపోకుండా చూసుకునేందుకు టీమ్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రోజు కర్నూలులో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద వేడుక కోసం మహేష్ అక్కడ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. ఒక్కడు షూటింగ్ లో పాల్గొన్నాడు కానీ ఫంక్షన్ల లాంటివి చేయడం ఇదే మొదటిసారి. మొన్నటి నుంచి కొత్త కొత్త వీడియో ప్రోమోలు వదులుతూనే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఆకట్టుకునే విధంగా ముఖ్యమైన సన్నివేశాలను ఈ టీజర్ల రూపంలో రిలీజ్ చేయడం మంచి ఫలితాన్నే ఇస్తోంది.

ఇక ఇప్పటిదాకా ఆడియోలో కానీ షూటింగ్ పరంగా కానీ బయటికి రాని మురారి బావ పాటను అతి త్వరలోనే జోడించే అవకాశాలున్నాయని ఇన్ సైడ్ టాక్. ప్రమోషన్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ సాంగ్ గురించి చెబుతూ యుట్యూబ్ లో రిలీజ్ చేస్తామని చెప్పాడు కానీ థియేటర్ గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పెద్ద తెరమీదే చూపిస్తారట. ఆల్రెడీ షూట్ చేసినట్టు లీకైన ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇవాళ నుంచి వీక్ డేస్ కాబట్టి కలెక్షన్ల డ్రాప్ ని సర్కారు ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలి.