తెలుగు ప్రేక్షకులందు యుఎస్ ఎన్నారై ప్రేక్షకులు వేరు. వాళ్లు ఆదరించే సినిమాల లెక్క వేరుగా ఉంటుంది. క్లాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ల పట్ల అక్కడి ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అప్పుడప్పుడు థ్రిల్లర్లకు కూడా మంచి ఆదరణ దక్కుతుంటుంది. అన్నింట్లోనూ వాళ్లు కోరుకునేది క్లాస్ టచ్. ఓవరాల్‌గా హైయెస్ట్ గ్రాసర్ల లిస్టు తీస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఊర మాస్ చిత్రాలకు అక్కడ ఆదరణ తక్కువే. బాహుబలి తరహా ప్రత్యేక చిత్రాల సంగతి వేరు. కానీ యుఎస్‌లో ఓవరాల్‌గా క్లాస్ టచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి.
మాస్ మసాలా, రొటీన్ యాక్షన్ చిత్రాలకు అక్కడి ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురవుతుంటుంది. కానీ ఈ లెక్కలు మహేష్ చిత్రాలకు వర్తించవనే చెప్పాలి. అతడికి ముందు నుంచి యుఎస్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. ‘దూకుడు’ చిత్రంతో తెలుగు సినిమాకు మిలియన్ డాలర్ క్లబ్బును పరిచయం చేసిందే మహేష్.
అప్పట్నుంచి మహేష్ చిత్రాల్లో ఒకటీ అరా తప్పిస్తే.. అన్నీ అలవోకగా మిలియన్ డాలర్ మార్కును అందుకున్నవే. ఇప్పటికే అతడి సినిమాలు 10 ఈ క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. టాలీవుడ్లో మరే హీరోకూ యుఎస్‌లో ఇన్ని మిలియన్ డాలర్ సినిమాలు లేవు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ కూడా ఆ లాంఛనాన్ని పూర్తి చేసింది. ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే ఆ చిత్రం మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. శనివారం షోలు పూర్తి కాకముందే ‘సర్కారు వారి పాట’ 1.5 మిలియన్ మార్కును కూడా అందుకుంది.
ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం, సినిమా కంటెంట్‌ను బట్టి చూస్తే అప్పుడే 1.5 మిలియన్ మార్కును దాటేయడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఊపు చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి మహేష్ మూవీ 2 మిలియన్ మార్కును కూడా అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.4 మిలియన్ డాలర్లు రాబట్టాలి. వచ్చే వారం పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి.. ఈ చిత్రం కాస్త కష్టంగా అయినా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.