లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు లేటెస్ట్ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆసుపత్రి కడతానన్న చిరంజీవిని ఉద్దేశించి ఈ ఇంటర్వ్యూలో కోట తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆసుపత్రి ఎవరికి కావాలి, ఫుడ్డు పెట్టించు అంటూ ఆయన చిరుకు చురకలంటించారు. చిరు ఎవరికీ ఎప్పుడూ సాయం చేయలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కోట్ల పారితోషకం తీసుకుంటూ చిరు కార్మికుడినని చెప్పుకోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.
ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే.. మెగా ఫ్యామిలీలో ఎవరి మీదా ఆయనకు సదభిప్రాయం లేదేమో అనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో నటుడిగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో చరణ్ ఎంత మంచి పేరు సంపాదించాడో తెలిసిందే. ముఖ్యంగా ‘రంగస్థలం’ చూసిన వాళ్లందరూ అతడి నట కౌశలానికి ఫిదా అయిపోయారు.
అలాంటిది చరణ్ మంచి నటుడు కాదంటూ కోట ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం వివాదాస్పదం అవుతోంది. చిరంజీవి కొడుకు కావడం వల్లే చరణ్‌కు పేరొచ్చిందని.. అంతే తప్ప నటుడిగా చరణ్ పొటెన్షియాలిటీ తనకు ఎక్కడా కనిపించలేదని, అతను మంచి నటుడే కావచ్చని, సరైన పాత్ర పడితే అతడి నటన బయటికి వస్తుందేమో అని కోట వ్యాఖ్యానించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం తారక్‌ను మించిన నటుడు లేడని ఆయనన్నారు. అతడిలో చాలా పొటిన్షియాలిటీ ఉందని, అది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుందని కోట అన్నారు. ఎన్టీఆర్ చక్కటి వాక్ శుద్ధి ఉందని, చా
లా చక్కగా డైలాగులు పలుకుతాడని.. ఎలాంటి డైలాగ్ అయినా అదరగొడతాడని.. నటన గురించి చెప్పాల్సిన పని లేదని.. తాతకు సరితూగే నటుడని ఆయన తారక్ మీద ప్రశంసలు కురిపించారు. అసలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అంటూ మెగా, నందమూరి అభిమానులు కొట్టేసుకుంటుంటే.. కోట చేసిన వ్యాఖ్యలు మరింతగా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చిచ్చు రేపేలా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates