మాజీ నటుడి మాట.. సినిమాలు పనికిమాలినవట

‘ఆనంద్’ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా గుర్తున్నాడా? దాని కంటే ముందు ఓ చినదాన, విజయం లాంటి సినిమాల్లో నటించినా.. ‘ఆనంద్‌’తో వచ్చిన గుర్తింపు వేరు. ఆ తర్వాత ఆ నలుగురు, మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు, ఒక ఊరిలో, బంగారం, స్టైల్, మాయాబజార్, టాస్, ఇదీ సంగతి.. ఇలా చాలా సినిమాల్లోనే నటించాడు రాజా.

పదేళ్లకు పైగానే సాగింది అతడి కెరీర్. ఇంత సుదీర్ఘ కాలం ఇండస్ట్రీలో ఉండి, పాతిక సినిమాల దాకా చేసి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో సినీ రంగానికి దూరమయ్యాడతను. ఇలా సినిమాలకు దూరం అయిన వాళ్లు బిజినెస్ వైపు అడుగులు వేస్తుంటారు.

కానీ రాజా మాత్రం క్రిస్టియానిటీ వైపు ఆకర్షితుడై.. స్పిరుచువల్ స్పీకర్ అవతారం ఎత్తాడు. యూట్యూబ్‌లోకి వెళ్లి అతడి స్పీచ్‌లు చూస్తే.. ఇలా అయిపోయాడేంటి.. అన్నేళ్ల పాటు సినిమాల్లో నటించిన వ్యక్తి ఇతనేనా అని ఆశ్చర్యం కలగక మానదు.

ఐతే ఆ స్పీచుల్లో రాజా చేసే ఇతర వ్యాఖ్యల సంగతి పక్కన పెట్టేద్దాం. కానీ తాజాగా అతను సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదం అవుతున్నాయి. తనకు అన్నేళ్ల పాటు ఫుడ్డు పెట్టి, తనకంత గుర్తింపు తెచ్చిన సినిమాల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడటం ఆశ్చర్యకరం.

ఈ సందర్భంగా అతను ‘‘పనికి మాలిన సినిమాలు’’ అనే మాట వాడటం గమనార్హం. ‘‘శుక్రవారం వచ్చింది. మార్నింగ్ షో.. ఎంత పట్టుదల? ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. లాస్ట్ డే దేవుడు చూపిస్తాడు సినిమా అబ్బబ్బబ్బా.. చాలా అద్భుతంగా ఉండబోతోంది. ప్రార్థించండయ్యా.. ఆ పనికి మాలిన సినిమాలు చూడటం వల్ల మీకు ఏ లాభమూ లేదయ్యా.. గంట సేపు లైన్లో నిలుచుని మూడు గంటల సినిమాలు చూసే బదులుగా నాలుగు గంటలు తల్లి, తండ్రి, మీ రక్త సంబంధీకుల కోసం, బంధువుల కోసం, ప్రపంచంలో సమాధానము కోసము ప్రార్థించండయ్యా. ఇంత చెడుతనం మన చుట్టు పక్కల ఉంటుండగా కూడా మనం ఏ మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం అంటే.. మనం దుష్టుడితో మనం ఫ్రెండ్షిప్ చేసుకున్నట్లే’’ అంటూ సాగిన రాజా స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోందిప్పుడు. సినీ రంగం నుంచి వెళ్లి సినిమాల గురించి ఇంత చులకన చేసి మాట్లాడటంపై రాజాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.