అశోక వనంలో అర్జున కళ్యాణం.. వాయిదాల మీద వాయిదాలు పడి.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర బృందం చేసిన అగ్రెసివ్ ప్రమోషన్ల వల్ల కావచ్చు.. టీవీ9తో విశ్వక్సేన్ గొడవ వల్ల కావచ్చు.. ఈ చిత్రానికి రిలీజ్ ముంగిట మంచి బజ్‌యే వచ్చింది. అలాగే తొలి రోజు మార్నింగ్ షోలకు ప్రేక్షకులేమీ విరగబడిపోలేదు. ఓ మోస్తరుగా ఆక్యుపెన్సీ కనిపించింది థియేటర్లలో.
ఐతే ఈ రోజు రిలీజైన మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే దీనికి ఎక్కువ థియేటర్లు దక్కాయి. ఆక్యుపెన్సీ పర్వాలేదనే చెప్పాలి. కాగా సినిమాకు ఉన్నంతలో మంచి టాకే రావడంతో సినిమా బలంగా పుంజుకున్నట్లే కనిపిస్తోంది. ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. మల్టీప్లెక్సుల్లో, కొంచెం చిన్న స్క్రీన్లలో ఫుల్స్ కూడా పడ్డాయి. ట్రెండ్ చూస్తే కచ్చితంగా సినిమాకు పాజిటివ్ టాక్ హెల్ప్ చేసినట్లే కనిపిస్తోంది.
ఇలాంటి చిన్న సినిమాలకు తొలి రోజు టాక్ చాలా కీలకం. అలాగని టాక్ వచ్చిన సినిమాలన్నింటికీ కూడా ఆక్యుపెన్సీ పెరిగిపోదు. ఐతే అశోకవనంలో అర్జున కళ్యాణం విషయంలో మాత్రం అంతా సానుకూలంగానే కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో ఫస్ట్, సెకండ్ షోలకు సినిమా హౌస్ ఫుల్స్‌తో నడవడం ఖాయంగా కనిపిస్తోంది.
తన గత చిత్రం పాగల్ గురించి మరీ అతిగా చెప్పి, చివరికి సినిమా అంత లేకపోయేసరికి ప్రేక్షకులతో తిట్లు తిట్టించుకున్నాడు విశ్వక్. అర్జున కళ్యాణం గురించి గొప్పగా చెబుతుంటే అనుమానంగానే చూశారు. ఐతే అతను చెప్పిన రేంజిలో కాకపోయినా డీసెంట్ మూవీ అన్న టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ వెంచర్ అయ్యేలాగే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి ఈ చిత్ర బృందానికి.. ఈ సినిమాతో ఏ సంబంధం లేని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సడెన్ పార్టీ కూడా ఇవ్వడాన్ని బట్టి చూస్తే విశ్వక్ హిట్టు కొట్టినట్లే కనిపిస్తోంది.