చిన్న సినిమాల సమరం.. గెలిచేదెవరు?


వేసవి అంటే భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోతుంటుంది. ఈ సారి కూడా సమ్మర్ సందడి మామూలుగా లేదు. ముందే మొదలైన వేసవి రేసులో భాగంగా ఇప్పటికే భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, ఆచార్య లాంటి భారీ చిత్రాలు థియేటర్లలోకి దిగాయి. వచ్చే వారం మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య రాబోతోంది. మధ్యలో ఖాళీ దొరికిన వారంలో మూడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాయి. అవే.. అశోకవనంలో అర్జున కళ్యాణం, భళా తందనాన, జయమ్మ పంచాయితీ. ఈ చిత్రాలు మూడు వేటికవే కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి.

విశ్వక్సేన్ ప్రధాన పాత్ర పోషించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఈ మూడు చిత్రాల్లో కాస్త ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఇందుకు ఈ సినిమా ప్రోమోలతో పాటు ఒక టీవీ ఛానెల్‌తో విశ్వక్ గొడవ కూడా పరోక్షంగా చిత్రానికి బజ్ పెంచింది.

‘రాజావారు రాణివారు’ దర్శకుడు రవికిరణ్ కోలా రచనలో, విద్యాసాగర్ చింతా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇదొక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ఇక వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే శ్రీ విష్ణు ఈ మధ్య కాస్త ట్రాక్ తప్పాడు. అతడితో ‘బాణం దర్శకుడు చైతన్య దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘భళా తందనాన’. ఎక్కువగా క్లాస్ సినిమాలు చేసే విష్ణు ఈసారి మాస్ ట్రై చేసినట్లున్నాడు ఈ చిత్రంతో. ఇది డబ్బుతో ముడిపడ్డ క్రైమ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. దీని ట్రైలర్ కూడా బాగానే సాగింది.

ఇక ఈ వారం బాక్సాఫీస్ రేసులో ఉన్న మరో చిన్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’కి సుమ కనకాలనే ప్రధాన ఆకర్షణ. యాంకర్‌గా సుదీర్ఘ ప్రస్థానాన్ని సాగిస్తున్న ఆమె ఈ దశలో లీడ్ రోల్ చేయడం చిత్రమే. శ్రీకాకుళం నేపథ్యంలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వచ్ఛమైన వినోదం, భావోద్వేగాలు ఉన్నట్లు కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా కనిపించాయి. ఐతే ఈ మధ్య ప్రేక్షకులు భారీ చిత్రాల కోసమే థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో ఈ చిన్న చిత్రాలను ఏమేర పట్టించుకుంటారు.. అందులోనూ హాలీవుడ్ మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్’ దూకుడును ఇవి ఏమాత్రం తట్టుకుంటాయన్నది చూడాలి.