నక్సలిజం బ్యాక్ డ్రాపే అసలు టెన్షన్

ఏదైనా సినిమా తీస్తున్నప్పుడు అందులో కథా వస్తువు వర్తమాన ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ పీరియాడిక్ సబ్జెక్టు తీసుకున్నప్పుడు బలమైన కంటెంట్ తో మెప్పించగలగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద అడ్రెస్ గల్లంతవుతుంది. ఆచార్య కంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు. ముఖ్యంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ ని అవసరానికి మించి జొప్పించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన దర్శకుడు కొరటాల శివ చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ ని చేతులారా వృథా చేసుకున్నారు.

దీని ఫలితానికి రానా సినిమాకి కనెక్షన్ ఏమనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం. విరాట పర్వం పూర్తిగా నక్సలైట్ల పోరాటం మీద రూపొందిన యాక్షన్ డ్రామా. దర్శకుడు వేణు ఊడుగుల అభ్యుదయాన్ని విప్లవాన్ని జొప్పించి అసువులు బాసిన వీరులకు ఒక నివాళిగా దీన్ని తీసే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే నెలలు గడుస్తున్నా అటు నిర్మాత సురేష్ బాబు నుంచి కానీ ఇటు హీరో రానా నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. హీరోయిన్ సాయిపల్లవి సైతం ఈ సినిమా ప్రస్తావన ఎక్కడా తీసుకురావడం లేదు.

నిజానికి ఈ నక్సలిజం కాన్సెప్ట్ కొంత కాలంగా టాలీవుడ్ కు అంతగా అచ్చిరావడం లేదు. ఆ మధ్య కార్తికేయ హీరోగా వచ్చిన రాజా విక్రమార్కలోనూ ఇదే మైనస్ అయ్యింది. ఇప్పుడే కాదు కృష్ణవంశీ సిందూరంతో మొదలుపెట్టి చూస్తే ఈ జానర్ కు ఆదరణ అంతగా లేదు. ఆర్ నారాయణమూర్తి, దాసరిలు మాత్రమే విజయాలు సాధించారు. ఇదంతా సరే కానీ అసలు విరాటపర్వం షూటింగ్ పూర్తి చేసుకున్నా థియేటర్ రిలీజ్ చేయడం కానీ ఓటిటికి ఇవ్వడం కానీ ఎందుకు చేయడం లేదో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.