సూప‌ర్ స్టార్ సినిమాకు అడ్వాంటేజ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట‌. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం జ‌ర‌గ‌డంతో మ‌హేష్ బాబు సినిమా వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయిపోయింది. చివ‌ర‌గా మ‌హేష్ బాబు నుంచి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ఫ‌లిత‌మే అందుకున్న‌ప్ప‌టికీ ఆ చిత్రం అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు అయితే లేద‌న్న అభిప్రాయాలు వినిపించాయి.

మ‌హేష్‌ను ఫుల్ ఎన‌ర్జీతో మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌లో చూడాల‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. గీత గోవిందంతో భారీ విజ‌యాన్నందుకున్న ప‌ర‌శురామ్.. మ‌హేష్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవ‌కాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని స‌ర్కారు వారి పాట‌ను మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌లాగే తీర్చిదిద్ది ఉంటాడ‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉంది.

ప్ర‌స్తుత టాలీవుడ్ బాక్సాఫీస్ ప‌రిస్థితి చూస్తే.. స‌ర్కారు వారి పాట‌కు అన్నీ భ‌లేగా క‌లిసొచ్చేలా క‌నిపిస్తున్నాయి. గ‌త వారాంతంలో విడుద‌లైన ఆచార్య డిజాస్ట‌ర్ అన్న‌ది స్ప‌ష్టం. ఈ వారం మూడు చిన్న సినిమాలు వ‌స్తున్నాయి. వాటి ప్ర‌భావం త‌ర్వాతి వారానికి ఉండ‌క‌పోవ‌చ్చు. కాగా ఈ ఏడాది టాలీవుడ్ కొన్ని ఘ‌న‌విజ‌యాలందుకున్న‌ప్ప‌టికీ.. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అయితే ఏదీ రాలేదు. భీమ్లా నాయ‌క్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌-2.. ఈ మూడూ బాగా ఆడినా అవి సీరియ‌స్ సినిమాలు.

మంచి ఫ‌న్ ఎంట‌ర్టైన‌ర్ రాని లోటు ఈ ఏడాది ఉంది. ఆచార్య కూడా నిరాశ ప‌ర‌చ‌డంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్, యూత్, అలాగే మ‌హేష్ అభిమానులు.. అంద‌రూ చూడాల‌నుకునే క‌మ‌ర్షియ‌ల్‌ ఎంట‌ర్టైన‌ర్ లాగా క‌నిపిస్తోంది స‌ర్కారు వారి పాట‌. ట్రైల‌ర్ చూస్తే మినిమం గ్యారెంటీ ఎంట‌ర్టైన్మెంటర్ లాగా ఉంది. ఓ మోస్త‌రుగా సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసినా.. ఈ చిత్రానికి వ‌సూళ్ల మోత మోగ‌డం ఖాయం.