మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’తో అతడికి దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు వచ్చింది. తనతో పని చేయడానికి టాలీవుడ్లోనే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని పెద్ద దర్శకులంతా ఆసక్తితో ఉన్నారు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి కాకముందే అతను శంకర్, గౌతమ్ తిన్ననూరిలతో సినిమాలు ఓకే చేసేశాడు. శంకర్ సినిమా ఇప్పటికే 60 రోజుల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఏడాదే అది పూర్తవడం, గౌతమ్‌తో సినిమాను పట్టాలెక్కించడం ఖాయం.
మరి తర్వాత చరణ్ ఎవరితో జట్టు కడతాడన్నది ఆసక్తికరం. ఐతే పేరు చెప్పలేదు కానీ.. టాలీవుడ్లో ఇప్పటిదాకా తనతో పని చేయని ఒక పెద్ద దర్శకుడితో కాంబినేషన్ గురించి చరణ్ ‘ఆచార్య’ ప్రమోషన్లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ మధ్య తనను కలిసిన ఓ పెద్ద దర్శకుడు తనతో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పాడని.. తన దగ్గర 3-4 కథలు ఉన్నాయని, వాటిలో ఒకటి చేద్దామని చెప్పాడని చరణ్ తెలిపాడు.
ఐతే ఇందుకు తాను బదులిస్తూ.. ‘‘మీరు చాలా పెద్ద డైరెక్టర్. నాతో ఏ కథ చేస్తే బాగుంటుందని, మీ కథల్లో ఏ పాత్రకు నేను బాగా సూటవుతానో మీకు కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ కథతో సినిమా చేద్దాం’’ అని చెప్పినట్లు చరణ్ వెల్లడించాడు. ఆ దర్శకుడు ఎవరన్నది చరణ్ చెప్పలేదు. కానీ సోషల్ మీడియా జనాలు ఆ డైరెక్టర్ ఎవరనే విషయంలో చర్చోపచర్చలు మొదలుపెట్టారు.
టాలీవుడ్లో చరణ్ పని చేయని పెద్ద దర్శకుడు అంటే త్రివిక్రమ్ శ్రీనివాసే అని చెప్పాలి. వీరి కలయికలో సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది కానీ.. ఇప్పటిదాకా అది వర్కవుట్ కాలేదు. కాబట్టి చరణ్ చెప్పింది త్రివిక్రమ్ గురించే అయ్యుండొచ్చని.. భవిష్యత్త్తులో వీరి కలయికలో ఓ సినిమా తప్పకుండా ఉండొచ్చని భావిస్తున్నారు. తనకు ‘రంగస్థలం’ లాంటి మరపురాని చిత్రాన్ని అందించిన సుకుమార్‌తోనూ చరణ్ మరో సినిమా చేసే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates