ఆచార్యపై RRR, కేజీఎఫ్ ఎఫెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో.. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ రూపొందించిన చిత్రం.. ఆచార్య. ఇంతటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా రిలజీవుతుంటే.. ఉండాల్సినంత హంగామా లేదన్న ఫీలింగ్ మెగా అభిమానులకే కలుగుతోంది. అందుకు కారణం.. గత నెల రోజుల వ్యవధిలో బాక్సాఫీస్ మోత మోగిపోవడమే.

మార్చిలో ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాలు వచ్చాయి. ఈ నెలలో ‘కేజీఎఫ్-2’ లాంటి మెగా మూవీ రిలీజైంది. ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపే అయినప్పటికీ.. రిలీజ్ ముంగిట దానికి హైప్ బాగానే ఉంది. ఎంతైనా అది ప్రభాస్ సినిమా. జనాలు ఆ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. వీకెండ్ వరకు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఎగబడి చూశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా అన్ని రికార్డులనూ తుడిచి పెట్టేస్తే.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసిందా సినిమా. ఆ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. గత వారం ‘కేజీఎఫ్-2’ రిలీజ్‌లో మళ్లీ థియేటర్లలో సందడి మామూలుగా లేదు. వరుసగా ఇలా భారీ చిత్రాలు రిలీజవడం.. వాటికి సంబంధించిన యుఫోరియాను ప్రేక్షకులు ఫీలవడంతో.. ‘ఆచార్య’ విషయంలో అంత ఉత్సాహం చూపించట్లేదమో అనిపిస్తోంది ట్రెండ్ చూస్తుంటే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాల రేంజ్ వేరు. వాటి చుట్టూ నెలకొన్న యుఫోరియా వేరు. వీటి ధాటికి మధ్యలో వచ్చిన చిన్న, మీడియం రేంజ్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.

ఎంత చిరు-చరణ్ కలిసి నటించినా.. కొరటాల డైరెక్ట్ చేసినా.. పై రెండు చిత్రాల హైప్‌ను ఇది మ్యాచ్ చేయలేకపోతోంది. జనాలు ఇప్పటికే మూడు భారీ చిత్రాల కోసం బాగా డబ్బులు ఖర్చు చేసేయడంతో ‘ఆచార్య’ కోసం ఎగబడే పరిస్థితి కనిపించడం లేదు. యుఎస్ ప్రిమియర్స్‌ బుకింగ్స్‌కు వస్తున్న స్పందనే ఇందుకు రుజువు. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ సమయానికి పరిస్థితి మారొచ్చేమో కానీ.. ఇప్పటికైతే ‘ఆచార్య’ మీద ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2ల ఎఫెక్ట్ బాగానే కనిపిస్తోంది.