కేజీఎఫ్-3.. పబ్లిసిటీ కోసమేనా?

ఒక భారీ చిత్రం రిలీజైనపుడు సీక్వెల్ ఊసులు వినిపించడం.. దాని మీద చర్చోప చర్చలు సాగడం.. తర్వాత సీక్వెల్ ముచ్చట పక్కకు వెళ్లిపోవడం చాలాసార్లు చూశాం. గత నెలలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సీక్వెల్ ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఊరించారు. కానీ ఈ సినిమాకు పని చేసిన ముఖ్య వ్యక్తులకు ఉన్న కమిట్మెంట్లు, ఇతర అంశాలను బట్టి చూస్తే ‘ఆర్ఆర్ఆర్-2’ వచ్చే అవకాశాలు అంతగా కనిపించడం లేదు.

కేవలం పబ్లిసిటీ కోసమే విజయేంద్ర ప్రసాద్ ఈ మాట అన్నారేమో అన్న సందేహాలు కలిగాయి. ఆయన సీరియస్‌గా అన్నా కూడా పరిస్థితులు అందుకు అనుకూలించేలా కనిపించడం లేదు. ఇక ‘కేజీఎఫ్’ సిరీస్‌లో మూడో చిత్రం మీదా ఇలాంటి డౌట్లే కొడుతున్నాయి. సినిమా చివర్లో ‘కేజీఎప్- చాప్టర్ 3’ గురించి హింట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

కానీ సమీప భవిష్యత్తులో ఈ సినిమా చేసేంత ఖాళీ ప్రశాంత్‌కు దొరుకుతుందా అన్నది సందేహమే. ముందుగా ‘సలార్’ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలి. ఆపై రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్లు ప్రశాంత్‌తో జట్టు కట్టడానికి ఆసక్తితో ఉన్నారు. మరి వాళ్లను కాదని ‘కేజీఎఫ్-3’ చేస్తాడా అన్నది సందేహం. దీని కంటే ముందు ‘కేజీఎఫ్-3’ చేయడం మంచి నిర్ణయమేనా అన్నది కూడా చూడాలి. ‘కేజీఎఫ్-2’లోనే కథేమీ లేదని.. అనవసరంగా సాగదీశారని విమర్శలు వచ్చాయి. ఎలివేషన్లు తప్ప ఎమోషన్ లేదని, అందుకు స్టోరీ లేకపోవడమే కారణమని చాలామంది అభిప్రాయపడ్డారు.

ఈ కథ ఇప్పటికే సాగతీతగా అనిపించినపుడు.. ఇంకో సినిమా చేస్తే వర్కవుట్ కాకపోవచ్చు. రాకీ బాయ్ విదేశాలకు వెళ్తాడని, అక్కడ హవా సాగిస్తాడని ‘కేజీఎఫ్-3’ గురించి ప్రచారాలు సాగుతున్నాయి కానీ.. నిజంగా అలా కథను నడిపిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా అన్నది డౌట్. ‘కేజీఎఫ్-2’ హైప్ వల్ల, బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసి రావడం వల్ల ఆడేస్తోంది కానీ.. కథాకథనాల పరంగా మైనస్‌లు చాలా ఉన్నాయి. ఇక్కడికే ఎలివేషన్లు ఓవర్ డోస్ అనిపించాయి. ఈ కోణాలన్నీ ఆలోచించి చూస్తే ‘కేజీఎఫ్-3’ కార్యరూపం దాల్చడం సందేహమే.