50 కోట్ల షేర్.. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చి నిలకడగా వసూళ్లు సాధిస్తే వరల్డ్ ఈ షేర్ వస్తుంది. అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ పరంగా చిన్న టెరిటరీ అయిన రాయలసీమలో మాత్రమే ఒక సినిమా రూ.50 కోట్ల షేర్ సాధించడం అంటే మాటలా? ఈ అరుదైన ఘనతను ఆర్ఆర్ఆర్ సినమా అందుకుంది.
బాహుబలి-2 అయిదేళ్ల కిందట రూ.35 కోట్ల షేర్ సాధిస్తే ఔరా అనుకున్నారు. అప్పటికి అది పెద్ద రికార్డు. ఈ అయిదేళ్లలో ఏ సినిమా కూడా ఆ ఘనత దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. రూ.30 కోట్ల షేర్ కూడా ఏ చిత్రానికీ సాధ్యపడలేదు. అలాంటిది ఆర్ఆర్ఆర్ బాహుబలి-2 రికార్డును దాటేయడమే కాదు.. ఏకంగా రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ చిత్రాన్ని సీడెడ్ ఏరియాలో రూ.45 కోట్లకు అమ్మారు. ఇంత షేర్ రాబట్టడం చాలా కష్టమని, బయ్యర్లు చాలా రిస్క్ చేస్తున్నారని అన్నారు. కానీ ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ సాధించి బయ్యర్లకు రూ.5 కోట్ల అధికారిక లాభాన్ని తెచ్చిపెట్టింది. నిజానికి రాయలసీమలో ఆర్ఆర్ఆర్‌కు బ్లాక్ టికెట్ల దందా మామూలుగా నడవలేదు. థియేటర్లలోనే ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు అమ్మారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ చిత్రం అక్కడ రూ.50 కోట్ల షేర్ సాధించింది కానీ.. అనధికారికంగా ఇంకా ఎక్కువ షేరే వచ్చి ఉంటుందని అంచనా.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.250 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉండడం విశేషం. కేజీఎఫ్-2 ప్రభంజనం మొదలయ్యాక కూడా ఈ సినిమా ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలోనే షేర్ రాబడుతోంది. ఆచార్య వచ్చే వరకు ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్ కొనసాగనుంది. ఈ వారాంతంలోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నారు.