పవన్ సినిమా వస్తేనే రూల్స్

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసరాలు సహా అన్ని ధరలూ జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. పెట్రోలు సహా అన్నింటి మీదా భారీగా పన్నులేసి జనాల నడ్డి విరగ్గొట్టేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సినిమా టికెట్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని, జనాల జేబులకు చిల్లులు పడిపోతోందని తెగ బాధ పడిపోయారు ప్రభుత్వ పెద్దలు. ఈ ఫీలింగ్ కూడా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాటు కలగలేదు.

గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే టికెట్ల రేట్లు జనాలకు భారమని గుర్తుకొచ్చింది. రాత్రికి రాత్రి రూల్స్ మారిపోయాయి. రేట్లు తగ్గిపోయాయి. అదనపు షోలన్నీ రద్దయిపోయాయి. తర్వాత ఏడాది పాటు సినీ పరిశ్రమ ఏపీలో గణనీయంగా తగ్గిపోయిన టికెట్ల రేట్లతో కుదేలైంది. సినీ ప్రముఖులు వచ్చి తన ముందు సాగిలపడ్డాక కానీ జగన్ మనసు కరగలేదు. టికెట్ల రేట్లు, షోలు పెంచుకోవడానికి అంగీకారం తెలిపి కూడా.. మళ్లీ పవన్ సినిమా ఇంకోటి (భీమ్లా నాయక్) వస్తోందని తెలిసి ఉద్దేశపూర్వకంగా జీవోను ఆపి.. ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందని రూఢి చేసుకున్నాక జీవోను వదలడం ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెబుతుంది.

ఐతే టికెట్ల ధరలు, అదనపు షోల విషయంలో ఈ జీవోలో కొన్ని షరతులు పెట్టడం తెలిసిందే. ఐతే ఆ రూల్స్‌ను ఒక్కో సినిమాకు ఒక్కో రకంగా వర్తింపజేస్తుండటమే విడ్డూరం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రెండూ కూడా వంద కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలే. కానీ ముఖ్యమంత్రిని రాజమౌళి కలిసి వ్యక్తిగతంగా కలిసి విన్నవించడంతో దానికి ఎక్కువగా రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించారు.

‘రాధేశ్యామ్’ టీం ఇలా కలవలేదు కాబట్టి నామమాత్రంగా రేట్లు పెంచుకోవడానికి, అది కూడా చివరి నిమిషంలో అనుమతులిచ్చారు. ఇక ఐదో షో విషయంలో ప్రభుత్వం పెట్టిన షరతు సంగతి అందరికీ తెలిసిందే. నాలుగు షోలు పెద్ద సినిమాను వేసుకుని, ఒక షోను చిన్న సినిమాకు కేటాయించలన్నారు. కానీ దీన్ని ఎవరూ పాటించడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’కు ఐదు షోలూ దాన్నే నడిపించారు. చిన్న సినిమాకు షోను కేటాయించలేదు.

ఇప్పుడు ‘బీస్ట్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలకు కూడా ఈ షరతునేమీ పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. ఏపీలో ఈ చిత్రాలకు అందుబాటులో ఉన్న థియేటర్లలో వీకెండ్ అంతా ఐదు షోలు నడిపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బుకింగ్స్ కూడా ఈ మేరకే నడుస్తున్నాయి. ఐతే తర్వాత వచ్చే సినిమాలకు కూడా నిబంధనలను ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా ఇంకోటి రిలీజైందంటే.. అన్ని రూల్స్ బయటికి వస్తాయి. అప్పుడు ఐదో షో కచ్చితంగా చిన్న సినిమానే వేయాలని అధికారులు ఉక్కుపాదం మోపడం ఖాయం. ఇంకా నిబందనల పేరు చెప్పి ఎన్ని విధాలుగా పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం గ్యారెంటీ.